మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ప్రాంతంలోని ప్రఖ్యాత రుబాయా కొల్టాన్ గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 200 మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
ప్రాంత గవర్నర్ లుబుంబా కాంబెరే ముయిసా వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం గని కూలిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, పిల్లలు, మార్కెట్ మహిళలు మట్టిలో కూరుకుపోయారు. కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడగా.. వాళ్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. వర్షాకాలంలో నేల బలహీనంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు.
గవర్నర్ సలహాదారు ఒకరు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు కనీసం 227 మంది మృతదేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.

రుబాయా గని ప్రపంచంలో సుమారు 15 శాతం కొల్టాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఖనిజాన్ని టాంటాలమ్‌గా మార్చి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఏరోస్పేస్ భాగాలు, గ్యాస్ టర్బైన్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మైన్‌లో తవ్వకాలకు మెషిన్ల సాయం తీసుకోకుండా.. స్థానికులకు డాలర్ల ఎర వేసి జరిపిస్తుంటారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుంటారు.
2024 నుండి ఈ గని ఎఎఫ్‌సీ/M23 అనే రెబల్ గ్రూప్ ఆధీనంలో ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈ గ్రూప్ గని సంపదను దోచుకొని తమ తిరుగుబాటుకు నిధులు సమకూర్చుకుంటోంది. ఈ చర్యలకు పొరుగు దేశం రువాండా మద్దతు ఇస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే రువాండా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. తాజా ప్రమాదం కాంగోలోని గనుల కార్మికుల దుర్భర పరిస్థితులను మరోసారి వెలుగులోకి తెచ్చింది.


