రష్యా సైనిక నిఘా అధికారిపై కాల్పులు  | Senior Russian officer shot in Moscow | Sakshi
Sakshi News home page

రష్యా సైనిక నిఘా అధికారిపై కాల్పులు 

Feb 7 2026 4:42 AM | Updated on Feb 7 2026 4:42 AM

Senior Russian officer shot in Moscow

డెలివరీ బాయ్‌గా వచ్చి దాడి చేసిన దుండగుడు  

మాస్కో: రష్యాలో కీలక సైనికాధికారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇందుకు ఉక్రెయిన్‌ కారణమని రష్యా ఆరోపిస్తోంది. శుక్రవారం రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వ్లాదిమిర్‌ అలెక్సేయెవ్‌(64)పై గుర్తు తెలియని దుండగుడు పలురౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో అలెక్సేయెవ్‌ తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

 రష్యా రాజధాని మాస్కోలో ఈ కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. అలెక్సేయెవ్‌ ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఇంట్లో ఉండగా డెలివరీ బాయ్‌ రూపంలో వచి్చన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన వెనుక సూత్రధారులు ఎవరన్నది అధికారులు ఇంకా గుర్తించలేదు. 2011 నుంచి రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘జీఆర్‌యూ’డిప్యూటీ చీఫ్‌గా అలెక్సేయెవ్‌ సేవలందిస్తున్నారు. 

సిరియాలో రష్యా సైనిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు ‘హీరో ఆఫ్‌ రష్యా’మెడల్‌ కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబీలో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండు రోజులపాటు జరిగిన చర్చలు శుక్రవారమే ముగిశాయి. అదేరోజు రష్యాలో సైనికాధికారిపై కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల్లో అలెక్సేయేవ్‌ పై అధికారి అయిన మిలటరీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అడ్మిరల్‌ ఇగోర్‌ కోస్టియుకోవ్‌ రష్యా తరఫున పాల్గొన్నారు. 

అలెక్సేయెవ్‌పై కాల్పుల గురించి అధికారులు రష్యా అధినేత పుతిన్‌కు సమాచారం అందించారు. ఈ దాడి గురించి ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ మాట్లాడుతూ.. అలెక్సేయెవ్‌పై కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఉగ్రవాదులను పురిగొలి్ప, ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement