రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్‌పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్‌తో డీల్ కుదిరిందని, ట్యాక్స్‌లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?
ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే
👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్‌తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్‌ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!
👉ఆ మౌనమే ట్రంప్‌ను బెంబేలెత్తించింది..
భారత్‌ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్‌ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.
👉జియోపాలిటిక్స్‌లో మౌనానికి అర్థాలే వేరు..
సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్‌లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్‌స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!
👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..
కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్‌ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్‌పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్‌ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్‌కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.
👉భారత్‌ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...
ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్‌కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్‌ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.
👉ఊహించని పరిణామం..
అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్‌తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
👉భారత్ స్వరం మార్చింది..
దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.
👉ఇంకా చెప్పాలంటే..
ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్‌లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది.


