బంగారం... భద్రతా? భారమా? | Impact Of Rising Gold Prices In India In Middle Class Struggles And Social Status | Sakshi
Sakshi News home page

బంగారం... భద్రతా? భారమా?

Feb 4 2026 12:29 PM | Updated on Feb 4 2026 12:36 PM

Impact Of Rising Gold Prices In India In Middle Class Struggles And Social Status

భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో బంగారం కేవలం విలు వైన లోహం మాత్రమే కాదు; అదొక సెంటిమెంట్, సామాజిక హోదా. ప్రస్తుతం మధ్యతరగతి మనఃస్థితికి, జాతీయ ఆర్థిక నిర్మా ణానికి మధ్య ఇది ఒక విరోధాభాసగా మారింది. ఒకవైపు బంగారం కొనాలనే సామాజిక అంచనాలు, మరోవైపు కొనలేని ఆర్థిక వాస్త వాల మధ్య సామాన్య కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బంగారం ధరల పెరుగుదల ప్రభావం ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై పడుతోంది. సమాజంలో వేళ్లూనుకున్న కట్నకాను కల సంస్కృతి, పరువు–ప్రతిష్ఠల పేరిట సాగే ఆడంబరాలు ఒక సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి.

 కుమార్తె వివాహం కోసం జీవితకాలపు పొదుపును ఖర్చు చేయడమే కాకుండా, బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి చివరకు ‘అప్పుల చక్రం’లో చిక్కుకుంటున్నారు. సంపన్న వర్గాలకు బంగారం ఒక ‘హెడ్జింగ్‌’ సాధనం. మార్కెట్‌ అస్థిరత ఉన్న ప్పుడు అది భద్రమైన పెట్టుబడిగా మారి వారి సంపదను పెంచుతుంది. అయితే ఇదే క్రమంలో సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక కోణంలో చూస్తే, ప్రపంచంలోనే అగ్రగామి బంగారం దిగుమతి దేశంగా భారత్‌ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి ఎదుర్కొంటోంది. 

ఇది చెల్లింపుల సమతుల్యత లోటును పెంచి, రూపాయి విలువను బలహీనపరుస్తోంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రమవుతుంది.కీలకమైన అంశం ఏమిటంటే, బంగారంపై పెట్టే అధిక పెట్టుబడి వల్ల దేశంలో ఉత్పాదక మూలధనం క్షీణిస్తోంది. పరిశ్రమలు, మౌలిక సదుపా యాలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడిగా వెళ్లాల్సిన నగదు బంగారంరూపంలో అచేతనంగా ఉండిపోతోంది. ఇది దేశ ఆర్థికవృద్ధి రేటును మందగింపజేస్తూ ‘అవుట్‌పుట్‌ గ్యాప్‌’ను సృష్టిస్తోంది. ప్రభుత్వం సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా భౌతిక బంగారం వైపు ప్రజలు వెళ్లకుండా చూస్తున్నా, సామాజిక దృక్పథం మారనంతవరకు ఆశించిన ఫలితం ఉండదు.

బంగారాన్ని గౌరవానికి చిహ్నంగా కాకుండా, ఒక సాధారణ పెట్టుబడిగా మాత్రమే చూడాలి. ప్రజలు మ్యూచువల్‌ ఫండ్లు, పెన్షన్‌ పథకాల వంటి ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక విద్యనుఅందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలి. బంగారం ధరల పెరుగు దల కేవలం మార్కెట్‌ పరిణామం కాదు; అదొక వ్యవస్థాగత హెచ్చరిక. మానవ మూలధనం, ఆర్థిక అవగాహన, సామాజిక సంస్కరణలే నిజమైన సంపద అని గుర్తించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. 
– ఆత్మకూరి ప్రశాంత్‌ చారి ‘ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫ్యాకల్టీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement