పొద్దున్నే లేవగానే.. ఓ కప్పు కాఫీ తాగడం దాదాపుగా అందరి దినచర్యలో భాగమే..! భారత్‌లో కాఫీ బిజినెస్ టర్నోవర్ 5 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంటుందని అంచనా..! అయితే.. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా తమిళనాడులోని నీలగిరి తోటలు లేదా కేరళలోని కాఫీ ఎస్టేట్లు లేదా కర్ణాటకలోని చిక్కమగళూరు తోటల పేరు చెప్పేస్తారు..! ఇప్పటికి అది నిజమే అయినా.. నిజానికి కాఫీ పుట్టింది భారత్‌లో కాదు. డచ్, బ్రిటిష్ కాలంలో కాఫీ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ.. అసలు భారత్‌కు కాఫీ గింజలను తెచ్చిన ఓ సూఫీ సాధువు. ఆయన కూడా భారత్‌లో కాఫీ పరిశ్రమ బిలియన్ల డార్లకు చేరుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. ఆ కథేంటో తెలుసుకోవాలని ఉందా?? అయితే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..!
భారత్‌లో కాఫీ కథ సూఫీ సాధువు అయిన బాబా బుడాన్‌తో మొదలవుతుంది. 1600లలో ఆయన హజ్ యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి తిరిగి వస్తున్న సమయంలో యెమెన్‌లోని అల్-మక్కా నౌకాశ్రయంలో కాఫీ రుచి చూశారు. అంతే.. ఏడు కాఫీ గింజలను తన గడ్డంలో దాచి, తీసుకువచ్చారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతంలో నిత్యం చలి, తేమతో ఉండే చంద్రగిరి కొండల్లో వాటిని నాటారు. అంతే.. ఆ ఏడు బీజాలే ‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా భారతదేశమంతటా విస్తరించాయి.
అప్పటి నుంచి చంద్రగిరి కొండల్లోని బాబా బుడాన్ కాఫీ మొక్కలు నాటిన కొండకు ఆయన పేరే పెట్టారు. ఆ కొండను బాబా బుడాన్ గిరి అని పిలుస్తారు. దత్తాత్రేయ పీఠానికి సమీపంలో ఈ కొండ ఉంది. ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ ఇక్కడి కాఫీ రైతులు కొత్త పంట రాగానే.. బాబా బుడాన్ దర్గా వద్ద కాఫీ గింజలను సమర్పిస్తారు. అలా.. భారత్‌లో కాఫీకి జన్మస్థలంగా చిక్కమగళూరును పిలుస్తారు. సక్కరపట్నం రాజు రుక్మంగడ తన చిన్నకుమార్తెకు ఈ గిరులను బహుమతిగా ఇచ్చారు. చిన్న కూతురు అంటే.. కన్నడంలో చిక్క మగళు అని అర్థం. అందుకే.. ఈ ప్రాంతానికి చిక్కమగళూరు అని పేరు వచ్చింది. ‘కర్ణాటక కాఫీ ల్యాండ్‌కు స్వాగతం’ అనే స్వాగత తోరణం ఈ జిల్లా ప్రవేశానికి ముందు కనిపిస్తుంది.
చిక్కమగళూరు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇక్కడి ముల్లయనగిరి అత్యంత ఎత్తులో ఉంటుంది. రోడ్ల వెంబడి సిల్వర్ ఓక్, రోజ్‌వుడ్, ప్లమ్, అత్తిచెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో అరేబికా, రోబస్టా వంటి రకాలను పండిస్తారు. ఫిల్టర్ కాఫీకి అరేబికా, ఇన్‌స్టంట్ కాఫీకి రోబస్టాను వాడుతారు. అరేబికా కంటే రోబస్టా కొంత చవక. రోబస్టాను లోయల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. అరేబికా అలా కాదు.. ఏటవాలు ప్రాంతాల్లోనే సవ్యంగా పండుతుంది. వీటితోపాటు.. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌లో కనిపించే లిబ్రికా, ఆగ్నేయాసియాలోని ఎక్సెల్సా వేరియంట్లు కూడా ఇక్కడ సాగవుతాయి. అసలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వచ్చే కాఫీ పరిమళంతో.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఎవరికైనా జిహ్వచాపల్యం కలగకమానదనడంలో అతిశయోక్తిలేదు. ఘాట్ రోడ్లలో.. ఇరువైపులా కాఫీ షాపులుంటాయి.
అలా చిక్కమగళూరులో 1600లలో ప్రవేశించిన కాఫీ.. క్రమంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడులోని నీలగిరి, కేరళలోని వయనాడ్కు వ్యాప్తి చెందాయి. దక్షిణ కర్ణాటకలోని కొడుగులో 1856లో ప్రవేశించిన కాఫీ.. ఇప్పుడు 11,331 హెక్టార్లలో సాగవుతోంది. బ్రిటిషర్ల కాలంలో మొత్తం 200 కాఫీతోటలు ఉండేవి. 1825లో కేరళలోని వయనాడ్‌లో కాఫీ పంటలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముర్డోక్ బ్రౌన్ పండించిన కాఫీ రకాన్ని ‘అంజరకాండి బ్రౌన్’ అని పిలిచేవారు.
1843లో కాక్బర్న్ షెవ్రోలెట్ ఓ కాఫీ తోటను ప్రారంభించారు. 1860లలో ఆర్నాల్డ్ నెల్లియంపతిలో పర్డేహ్యారీ ఎస్టేట్ మొదలైంది. 1860 నాటికి దక్షిణ భారతదేశంలో కాఫీ సాగు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 1860లలో అరేబికా ప్రధాన సాగుగా ఉండేది. 1900 సంవత్సరం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చిన రోబస్టా ఊపు ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా కాఫీతోటలు విస్తరించాయి. నిజానికి అరేబికా పంటకు కాండంతొలిచే పురుగు బెడద ఉండడంతో.. రైతులు అప్పట్లో రోబస్టా వైపు మొగ్గుచూపారు.
అప్పట్లో బ్రిటిషనర్లు ఇక్కడ పండే కాఫీ గింజలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పటికీ దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు.. కాఫీ గింజల ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారతీయ కాఫీలో 70శాతం కర్ణాటకలోని కొడుగు, చిక్కమగళూరు, హసన్‌లలో ఉత్పత్తి అవుతుంది. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుండగా.. అందులో సింహభాగం.. అంటే.. లక్షా ముప్ఫై వేల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలా మన దేశంలో కాఫీ బిజనెస్ 5 బిలియన్ డాలర్ల దాకా చేరుకుంది.
కాఫీడే, స్టార్ బక్స్, మోచా, బారిస్టా, కోస్టా, థర్డ్ వేవ్ కాఫీ వంటి డిజైనర్ కాఫీ స్టూడియోలు సైతం లాభాలను గడించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


