మౌనంగానే మెడలు వంచి! | India-US Trade Deal Shows Patience Paid Off Says PM Modi | Sakshi
Sakshi News home page

మౌనంగానే మెడలు వంచి!

Feb 4 2026 4:33 AM | Updated on Feb 4 2026 4:33 AM

India-US Trade Deal Shows Patience Paid Off Says PM Modi

అమెరికాతో వాణిజ్య ఒప్పందం వెనక...

ఫలించిన మోదీ వేచి చూసే ఎత్తుగడ

ఇతర దేశాలతో వరుసగా ఒప్పందాలు

దాంతో ట్రంప్‌పై పెరిగిన ఒత్తిడి

ఈయూ–భారత్‌ ఒప్పందంతో బెంబేలు

దిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు      

అసలే అతను డొనాల్డ్‌ ట్రంప్‌. శత్రువులా, మిత్రులా అన్న తేడా కూడా లేకుండా అన్ని దేశాలనూ హడలెత్తిస్తూ వస్తున్న వ్యక్తి! కఠిన పదజాలంతో కూడిన బెదిరింపులతో, ఎడాపెడా టారిఫ్‌ల బాదుడుతో వణుకు పుట్టించడాన్నే తన నైజంగా మార్చుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టింది మొదలు, ఈ ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు ఒకరకంగా పీడకలలా పరిణమించారు. చివరికి దక్షిణ కొరియా, బ్రిటన్‌ వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలు కూడా ట్రంప్‌ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు అనుగుణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ విషయంలో మాత్రం ట్రంప్‌ హఠాత్తుగా దిగొచ్చిన తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్‌ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. 

బెదిరింపులనే తిరుగులేని ఆయుధంగా చేసుకుంటూ గత ఏడాది కాలంలో ట్రంప్‌ చెలరేగి పోయారు. దేశాధినేతలంతా తాను చెప్పినట్టు వినాలన్న ఒంటెత్తు పోకడ ప్రదర్శించారు. చివరికి నోబెల్‌ శాంతి పురస్కారానికి తాను అర్హుడినంటూ ప్రకటనలు చేయాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే స్థాయికీ వెళ్లారు! పాక్‌ లాంటి పలు దేశాల అధినేతలు అందుకు తలొగ్గారు కూడా. కానీ మోదీ నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. దాంతో ట్రంప్‌ ఇగో దెబ్బ తిన్నది కూడా. మోదీ వ్యక్తిగతంగా ఫోన్‌ చేయనందుకే భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్‌ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. ప్రధాని మాత్రం వీటిని పట్టించుకోలేదు. అంతేగాక ట్రంప్‌ బెదిరింపుల ఉచ్చులో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఒప్పందం విషయమై ట్రంప్‌ నాలుగుసార్లు స్వయంగా ఫోన్‌ కాల్స్‌ చేసినా పట్టించుకోలేదు. ఆయన కారాలు, మిరియాలు నూరుతున్నా లక్ష్యపెట్టకుండా బ్రిటన్, న్యూజిలాండ్, అనంతరం ఒమన్‌లతో లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్‌నే మించిపోయే స్థాయిలో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించారు. ఈ చర్యతో ఆయనను పునరాలోచనలో పడేశారు. ఇక గత నెలలో యూరోపియన్‌ యూనియన్‌తో అతి కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్‌ ఖరారు చేసుకుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీదని కొనియాడుతున్న ఈ డీల్‌ భారత్‌పై దూకుడు విషయంలో ట్రంప్‌కు గట్టిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.

27 దేశాల కూటమి అయిన ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని మరింత పెంచింది. ట్రంప్‌ చపలచిత్తం పుణ్యమా అని ఇతర దేశాల దృష్టిలో అమెరికా శరవేగంగా విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. అందుకు విరుద్ధంగా భారత్‌ మాత్రం అత్యంత నమ్మదగ్గ భాగస్వామ్య దేశంగా తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చింది. పైగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌ను ఏ దేశమూ ఇప్పుడు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు అమెరికా కూడా మినహయింపు కాదు. అందుకే వ్యవసాయ, పాడి తదితర కీలక రంగాలను అమెరికా పరిశ్రమలకు బాహాటంగా తెరిచేందుకు కరాఖండిగా నిరాకరించి కూడా ఒప్పందానికి ట్రంప్‌ను భారత్‌ ఒప్పించగలిగింది! అదే సమయంలో ట్రంప్‌ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రతి వ్యాఖ్యలకు దిగకుండా మోదీ పరిణతి ప్రదర్శించారు. 

చైనాతో స్నేహ గీతం
ట్రంప్‌ దూకుడుకు చెక్‌ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యేందుకు కూడా భారత్‌ వెనకాడలేదు. గతేడాది షాంఘై సహకార సమాఖ్య భేటీకి హాజరయ్యేందుకు ఏడేళ్ల అనంతరం మోదీ చైనాలో పర్యటించారు! ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ట్రంప్‌ కూడా వాటిపై చిర్రబుర్రులాడారు. భారత్, రష్యాలను అమెరికా చివరికి చైనాకు కోల్పోయిందంటూ నిట్టూర్చారు! ఆ తర్వాత రెండు నెలలకే పుతిన్‌కు ఢిల్లీలో మోదీ రాచమర్యాదలు చేశారు.

రష్యాతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇలా పలు అగ్ర రాజ్యాలతో భారత్‌ వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటున్న వైనం కూడా ట్రంప్‌ను పునరాలోచనలో పడేసింది. భారత్‌ అక్కడితోనే ఆగలేదు. ట్రంప్‌ టారిఫ్‌లకు ప్రతీకా రంగా తాను కూడా అమెరికాపై సుంకాలు బాదింది! అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై ఏకంగా 30 శాతం టారిఫ్‌లు విధించింది. ట్రంప్‌లా గొంతెత్తి ప్రకటనలు చేయకుండా మౌనంగానే గత నవంబర్‌ నుంచే వాటిని వసూలు చేయడం కూడా ప్రారంభించింది.

‘ఒప్పందం’పై మోదీ మౌనం
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని ట్రంప్‌ ప్రకటించినా, దానిపై మోదీ మాత్రం సూటిగా స్పందించకపోవడం విశేషం. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్‌ ఒప్పుకుందని, అమెరికా నుంచి దిగుమతులను ఏకంగా 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లనుందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ మౌనమే వహించారు. కేవలం టారిఫ్‌ల తగ్గింపుకు హర్షం వ్యక్తం చేయడానికే తన స్పందనను పరిమితం చేయడం గమనార్హం. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

‘గోర్‌’ ఫ్యాక్టర్‌
సెర్గియో గోర్‌. భారత్‌లో అమెరికా నూతన రాయబారి. భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం, టారిఫ్‌ల తగ్గింపు వెనక ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలు కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిన తరుణంలో గత జనవరి 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎన్నడూ లేనంత బలోపేతం చేయడమే ఆ సందర్భంగా స్పష్టంగా ప్రకటించారు. ‘నిజమైన మిత్రులు తొలుత విభేదించవచ్చు. కానీ అంతిమంగా ఒక్కతాటిపైకే వస్తారు’ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్‌ కంటే ముఖ్యమైన దేశం మరేదీ లేదని కూడా స్పష్టం చేశారు.

ఖనిజాల అన్వేషణ, ఏఐ టెక్నాలజీ వాడకానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన ‘పాక్స్‌ సిలికా’ కూటమిలో చేరాల్సిందిగా భారత్‌ను ఆహ్వానించారు కూడా. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కాస్తా ఆయన వచ్చిన మూడు వారాల్లోపే వీడిపోవడం విశేషం. ట్రంప్‌కు అత్యంత సన్నిహితునిగా గోర్‌కు పేరుంది. ఏ సందర్భంలోనైనా గోర్‌ను తాను పూర్తిగా విశ్వసిస్తానని ట్రంప్‌ చెబుతుంటారు. భారత్‌తో ఒప్పందం, టారిఫ్‌ల తగ్గింపు విషయంలో ట్రంప్‌పై ఆయన ప్రభావం చాలా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

మాకు సమాచారం లేదు: రష్యా
    మాస్కో: చమురు కొనుగోళ్ల నిలిపి వేతపై భారత్‌ నుంచి ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్‌ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. ఇకపై వెనెజువెలా నుంచే భారత్‌ అధికంగా చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ మంగళవారం ఈ మేరకు స్పందించారు. భారత్‌తో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

ట్రంప్‌ వ్యాఖ్య లను నిశితంగా పరిశీలి స్తున్నట్టు రష్యా ఇంధన రంగ వ్యవహారాలు చూసే ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్‌ చెప్పారు. భారత రిఫైనరీల నుంచి ఒప్పందాల రద్దు దిశగా ఎలాంటి నోటీసులూ అందలేదని రష్యా ఇంధన శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ భారీగా పెంచుకోవడం తెలిసిందే. ఆ దేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కూడా నిలిచింది. దీనిపై అమెరికాతో పాటు యూరప్‌ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయని సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement