వేదాంత గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సంపదలో 75 శాతాన్ని సమాజ సేవ కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న అనిల్ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఈ సంచలన ప్రకటన చేశారు. అనిల్ అగర్వాల్‌కు ఇద్దరు సంతానం కుమారుడు అగ్నివేష్ అగర్వాల్, కూతురు ప్రియా అగర్వాల్(2013లో ఆకాష్ హెబ్బర్‌ను వివాహం చేసుకున్నారు). అనిల్ మొత్తం నెట్‌వర్త్ సుమారు రూ.3.66 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అందులో తన వ్యక్తిగత సంపదను దానం చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రధానితో భేటీ.. ఒక భావోద్వేగ ప్రయాణం
ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా జరిగిన ‘గ్లోబల్ ఎనర్జీ లీడర్స్’ రౌండ్ టేబుల్ సమావేశంలో అనిల్ అగర్వాల్ పాల్గొన్నారు. తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చూపిన చొరవను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ తన మనోభావాలను పంచుకున్నారు.
‘మా కుటుంబంలో విషాదం తర్వాత నేను హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. వ్యక్తిగత నష్టంతో కుంగిపోయిన మాకు ప్రధానమంత్రి మోదీ అందించిన ఓదార్పు, సానుభూతి వెలకట్టలేనివి. ఆయన మాటలు నాకు, నా భార్యకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చాయి’ అని అగర్వాల్ పేర్కొన్నారు.
కుమారుడి ఆశయ సాధనే లక్ష్యం..
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కేయింగ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. తన కుమారుడి కోరికలకు అనుగుణంగానే ఈ దాతృత్వ నిర్ణయం తీసుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.
ఇకపై తాను వ్యాపార ప్రమోటర్‌గా కాకుండా కేవలం ఒక ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తానని అనిల్ అగర్వాల్ స్పష్టం చేశారు. వ్యాపార నియంత్రణ కంటే సామాజిక ప్రభావానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రధాని పరామర్శ
తీవ్ర దుఖంలో ఉన్న అగర్వాల్ దంపతులను ప్రధాని మోదీ ధైర్యంగా ఉండాలని కోరారు. ‘మీరు దృఢంగా ఉండాలి. మీ పనిని కొనసాగించాలి. అది దేశానికి చాలా ముఖ్యం’ అని ప్రధాని ఇచ్చిన సలహా తమకు ఎంతో ఊరటను ఇచ్చిందని అగర్వాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల బాధలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునే నాయకుడు ఉండటం అదృష్టమని ఆయన ప్రశంసించారు.
ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..


