ఫండ్లకు కొంత కేటాయిస్తే మెరుగైన ఆదాయం
స్థిరమైన ఆదాయానికి ఎఫ్‌డీలు తప్పనిసరి
అత్యవసరమైతే తీసుకునేలా సేవింగ్స్‌లోనూ కొంత
ఒకచోట తక్కువ వచ్చినా మరోచోట ఎక్కువ రాబడి
ప్రశాంతమైన జీవితానికి డైవర్సిఫికేషన్ తప్పనిసరి
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ద్వారా నెలవారీ మొత్తం
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్‌డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి.
మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్‌డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....
ప్రాధాన్యాలు మారుతాయి..
వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి.
సౌకర్యవంతంగా జీవించాలంటే...
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి...
→ కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000
→ నిత్యావసరాలు : రూ. 10,000–12,000
→ వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000
→ ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000
→ ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్‌గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది.
→ మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.
ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి?
రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..
సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు..
→ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం
ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్‌ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు.
→ డెట్ మ్యూచువల్ ఫండ్స్
వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి.
→ సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్
→ స్వల్పకాలిక ఫండ్స్
→ కార్పొరేట్ బాండ్ ఫండ్స్
వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్‌డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్‌డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు.
→ ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్)
– పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం
ఎస్‌డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్‌డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌తో కలిపి ఉపయోగించుకోవచ్చు.
→ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం
సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి.
శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో (రూ. 1 కోటి నిధి)
→ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు + ఎస్‌సీఎస్‌ఎస్: రూ. 35 లక్షలు
→ డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు
→ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు
→ ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు
పోర్ట్‌ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు ..
→ భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి
→ వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్‌డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి
→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.
→ నామినేషన్లు, వీలునామా అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి
→ తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.


