ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్‌ | consumers opt for Online Shopping retailers difficulties special story | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్‌

Mar 12 2026 12:09 PM | Updated on Mar 12 2026 12:33 PM

consumers opt for Online Shopping retailers difficulties special story

గిరాకీ లేక వ్యాపారుల బేజారు

ఆన్‌లైన్‌షాపింగ్‌తో షాపులపై ఎఫెక్ట్‌

ఈకామర్స్‌తో ఆకట్టుకుంటున్న మాల్స్‌, ఇంట్లో నుంచి అన్ని ఆర్డర్లు

దుకాణాలకు వచ్చేందుకు వినియోగదారుల నిరాసక్తి 

తగ్గిన కొనుగోళ్లు..  మూతపడుతున్న దుకాణాలు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఇరువై ఏళ్లకు పైగా నడుస్తుంది. మొదట్లో నిత్యం విమాన టికెట్లు.. ఆన్‌లైన్‌ సర్వీస్‌.. విదేశాల నుంచి డబ్బులు వచ్చేవి. వీటి కోసం ప్రతీ రోజు కనీసం వంద మంది కస్టమర్లు వచ్చేవారు. కానీ నేడు నెలకు వంద మంది కూడా రావడం లేదు. ఇటీవల టెక్నాలజీలో వచ్చిన మార్పులతో ఆన్‌లైన్‌ సెంటర్లకు వచ్చే వారు తగ్గిపోయారు. ఫలితంగా గది అద్దె చెల్లించడం కూడా భారంగా మారుతుంది.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కిరాణాదుకాణాలు.. సూపర్‌మార్కెట్లు.. పేరు ఏదైనా వ్యాపారాలు మాత్రం బేజారయ్యాయి. ఒకప్పుడు ప్రతీ రోజు వందలాది మంది వినియోగదారులతో కళకళలాడేవి. నేడు ఆ వ్యాపారసంస్థలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. మెట్రో నగరాలలో కనిపించే పెద్ద..పెద్ద మాల్స్‌.. ఆన్‌లైన్‌ షాపింగ్‌మాల్స్‌ నేడు చిన్న చిన్న పట్టణాలకు చేరడంతో వినియోగదారులు అక్కడికే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద..పెద్ద షాపింగ్‌మాల్స్‌.. అన్ని వస్తువులు ఒకే చోట లభించడం.. భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు పెట్టిన బోర్డులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా మండల కేంద్రాలలో ఉన్న సూపర్‌మార్కెట్లు.. మెడికల్‌షాపులు .. బట్టలదుకాణాలు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

 చిన్న పట్టణాల్లో షాపింగ్‌మాల్స్‌
హైదరాబాద్, కరీంనగర్‌లో కనిపించే పెద్ద షాపింగ్‌మాల్స్‌ ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడల్లో ఏర్పాటవుతున్నాయి. ఆటోలు పెట్టి గ్రామాల్లో ప్రచారం చేస్తుండడంతో కస్టమర్లు అక్కడికే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక వ్యాపారులకు భారీగా నష్టం ఏర్పడుతుండగా.. వినియోగదారులు సైతం షాపింగ్‌మాల్స్‌లో కనిపించే డిస్కౌంట్లకు ఆకర్షితులై ఒకటి, రెండు వస్తువులు కొందామనుకున్న వారు నాలుగైదు కొనుగోలు చేస్తున్నారు.  

 అంతా ఆన్‌లైన్‌లోనే..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. అమేజాన్, ఫ్లిప్‌కార్టుతోపాటు బడా కంపెనీలు ఈకామర్స్‌ వెబ్‌సైట్స్‌లలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లోనే కూర్చుండి ఆర్డర్‌ పెట్టేస్తున్నారు. టూత్‌బ్రష్‌ నుంచి నూనె, ఫుడ్, మెడిసిన్, బట్టలతోపాటు మనిషికి అవసరం ఉన్న ప్రతీ వస్తువు దొరుకుతుండడం.. బయటకు వెళ్లే అవసరం లేకపోవడంతో చాలా మంది మహిళలు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. దీని ద్వారా మన గల్లీల్లో ఉండే కిరాణాదుకాణాలు, మెడికల్‌ షాపులు, పండ్ల దుకాణాలు చివరికి పూల దుకాణాల్లో వ్యాపారాలు పడిపోతున్నాయి. ఫలితంగా గల్లీల్లోని దుకాణాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.

ఉచిత బస్సు.. వ్యాపారాలు తుస్సు
ప్రభుత్వం ఎన్నికల హామీ మహిళలకు ఉచిత బస్సును అమలు చేయడంతో చాలా మంది ఏ చిన్న పనికైనా కరీంనగర్, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్తున్నారు. దీని ద్వారా మండల కేంద్రాల్లో ఉన్న సూపర్‌మార్కెట్లు, వస్త్రవ్యాపార సంస్థల్లో గిరాకీలు లేక అద్దె చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. 

(అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్‌ పైలట్ ఆవేదన వైరల్‌)

ఏది కొన్న రూ.10
కరోనా తర్వాత వ్యాపారాల్లో చాలా మార్పులు వచ్చాయి. గ్రామాల్లో చిరువ్యాపారులు తమ బైక్‌లు, ఆటలలో నిత్యావసరాలు.. ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఉప్పు, సబ్బులు వేసుకొని పల్లెల్లో తిరిగి అమ్ముతున్నారు. దీని ద్వారా గ్రామాల్లో కిరాణాషాపులు, మండల కేంద్రాల్లోని సూపర్‌ మార్కెట్లలో సగం గిరాకీ పడిపోయింది. 

ఇదీ చదవండి: ఇరాన్‌ యుద్ధం-ఎల్‌పీజీ సంక్షోభం, పరిస్థితి ఇదీ!

సగం వ్యాపారం పడిపోయింది
ఒకప్పుడు నిత్యం దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది. దీంతో అద్దెచెల్లింపులు, గుమస్తాల జీతాలు, నిర్వహణ ఖర్చులు భరించడం ఇబ్బందిగా మారింది. ఇటీవల ఆన్‌లైన్‌షాపింగ్స్‌ ఎక్కువ చేస్తుండడం మాలాంటి వ్యాపారాలు పడిపోయాయి.  – సత్యం, వ్యాపారి, ఎల్లారెడ్డిపేట

ఇది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ సూపర్‌మార్కెట్‌. రెండేళ్ల క్రితం ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ షాప్‌లో ఇప్పుడు గిరాకీ అంతంతే ఉంది. నిత్యం రూ.20వేల వరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు రూ.10 వేలకు పడిపోయింది. ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు బుక్‌  చేసుకుంటుండడంతో సూపర్‌మార్కెట్‌లకు వచ్చే జనం తగ్గిపోయి నిర్వహణ భారంగా మారుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement