ఫోర్బ్స్ జాబితాలో సరికొత్త రికార్డులు!
ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన 2026 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, భారతదేశం సంపద సృష్టిలో సరికొత్త రికార్డులను సృష్టించింది. దేశంలో కుబేరుల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, వారి నికర ఆస్తుల విలువ కూడా లక్ష కోట్ల డాలర్ల మార్కును అధిగమించడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థ దూకుడుకు అద్దం పడుతూ దేశీయ కుబేరుల సంఖ్య సరికొత్త గరిష్టానికి చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకటించిన 40వ వార్షిక బిలియనీర్ల జాబితా ప్రకారం, గతేడాది 205 మందిగా ఉన్న భారతీయ బిలియనీర్ల సంఖ్య ఈసారి 229కి పెరిగింది. స్టాక్ మార్కెట్ల సానుకూల ధోరణి, వరుస ఐపీఓలు సంపద పెరుగుదలకు ప్రధాన చోదక శక్తిగా నిలిచాయి.
భారత బిలియనీర్ల మొత్తం సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.92 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. 2025లో ఈ విలువ 941 బిలియన్ డాలర్లుగా ఉండేది. కేవలం అగ్రగామి 10 మంది భారతీయ కుబేరుల వద్దే 368 బిలియన్ డాలర్ల (రూ.33.85 లక్షల కోట్ల) సంపద కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.
అంబానీ, అదానీలదే అగ్రస్థానం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 99.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్, ఆసియాలోనే అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద ఏడాది కాలంలో 12% వృద్ధి చెందింది. ఇక గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరూ కలిసి గతేడాది తమ సంపదకు సుమారు రూ.1.35 లక్షల కోట్లను జోడించారు.
ప్రధాన విశేషాలు
సావిత్రి జిందాల్.. 39.1 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.
లక్ష్మీ మిట్టల్.. ఆర్సెలర్ మిట్టల్ షేర్ల విజృంభణతో ఈయన సంపద 61% పెరిగి 31 బిలియన్ డాలర్లకు చేరింది.
ఉదయ్ కోటక్.. బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ తొలిసారిగా టాప్-10 జాబితాలోకి ప్రవేశించారు.
అరవింద్ శ్రీనివాస్.. 31 ఏళ్ల వయసులోనే పర్‌ప్లెక్సిటీ కో-ఫౌండర్ అరవింద్ అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్‌గా రికార్డు సృష్టించారు.
భారతదేశంలోని టాప్-10 కుబేరులు (ఫోర్బ్స్ 2026)
| ర్యాంక్ | పేరు | సంపద (బిలియన్ డాలర్లు) | సంస్థ |
|---|---|---|---|
| 1 | ముకేశ్ అంబానీ | 99.7 | రిలయన్స్ ఇండస్ట్రీస్ |
| 2 | గౌతామ్ అదానీ | 63.8 | అదానీ గ్రూప్ |
| 3 | సావిత్రి జిందాల్, ఫ్యామిలీ | 39.1 | ఓపీ జిందాల్ గ్రూప్ |
| 4 | లక్ష్మీ మిట్టల్ | 31.0 | ఆర్సెలర్ మిట్టల్ |
| 5 | శివ్ నాడార్ | 30.9 | హెచ్‌సీఎల్ టెక్ |
| 6 | సైరస్ పూనావాలా | 27.0 | సీరమ్ ఇన్‌స్టిట్యూట్ |
| 7 | దిలీప్ సంఘ్వీ | 25.6 | సన్ ఫార్మా |
| 8 | కుమార మంగళం బిర్లా | 21.1 | ఆదిత్య బిర్లా గ్రూప్ |
| 9 | రాధాకిషన్ దమానీ | 15.7 | అవెన్యూ సూపర్ మార్ట్స్ |
| 10 | ఉదయ్ కోటక్ | 14.4 | కోటక్ మహీంద్రా బ్యాంక్ |
ఫోర్బ్స్ జాబితాలో మెరిసిన తెలుగు కుబేరులు
మురళీ దివి (దివీస్ ల్యాబ్స్)
పి.పి. రెడ్డి, పి.వి. కృష్ణా రెడ్డి (మేఘా ఇంజినీరింగ్-మెయిల్)
బి.పార్థసారథి రెడ్డి (హెటిరో గ్రూప్- ఫార్మా)
పి.వి. రామప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా)
సతీశ్ రెడ్డి, జి.వి. ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్)
జుపల్లి రామేశ్వరరావు (మై హోమ్ గ్రూప్-రియల్ ఎస్టేట్)
సురేందర్ సలూజా (ప్రీమియర్ ఎనర్జీస్- సోలార్ ఎనర్జీ)
ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్)
ఎం. సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్ఎన్ ల్యాబ్స్)
గ్రంధి మల్లికార్జున రావు (జీఎంఆర్ గ్రూప్-విమానాశ్రయాలు)
ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా?


