ఇండోర్: మూడు ఇళ్లు, కార్లు, ఆటోలు, వడ్డీ వ్యాపారం. ఈ ఆస్తులు.. వడ్డీ వ్యాపారం ఇవన్నీ చూస్తుంటే ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఆస్తులేనని అనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే. మీరనుకుంటున్నట్లు ఈ ఆస్తులన్నీ కోటీశ్వరుడివి కావు. ఓ సాదాసీదా బెగ్గర్‌వి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్’లో వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం వీధుల్లో భిక్షాటన జీవితాలను మార్చడం. భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి వారికి పునరావాసం కల్పించడం. ఈక్యాంపెయిన్‌లో ఓ ప్రాంతంలో బిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే వ్యక్తి గురించి ఫిర్యాదులు రావడంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పునరావాసం కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో అధికారులు సైతం కళ్లు బైర్లు కమ్మేలా అతని ఆస్తులు కోట్లలో ఉన్నట్లు నిర్ధారించారు.
బిక్షమెత్తుతూ కోట్లకు పడగనెత్తిన గీలాల్ ఘటన చర్చాంశనీయంగా మారింది. భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బుతో అతను కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టాడని అధికారులు వెల్లడించారు. తమ దర్యాప్తులో మంగీలాల్ వద్ద 600ఎస్‌ఫ్‌టీలలో భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ ప్రాంతాల్లో మూడు ఇళ్లు, మూడు ఆటోలు,స్విఫ్ట్ డిజైర్‌లు ఉన్నాయి. స్విప్ట్ డిజైర్ కోసం ఓడ్రైవర్‌ను పెట్టుకున్నాడు. తాను బిక్షాటనకు ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా అదే కారులో వచ్చేవాడు. ఖాళీ సమయాల్లో అద్దెకు తిప్పేవాడు. అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంయుక్తంగా చేపట్టిన పథకం ద్వారా మంగీలాల్‌కు ఒక వన్ బీహెచ్‌కే ఇల్లు కూడా కేటాయించింది. అయినప్పటికీ, అతను భిక్షాటనను ఆపలేదు. చెక్కతో చేసిన కార్డు పట్టుకుని ఇండోర్ వీధుల్లో భిక్షాటన కొనసాగిస్తున్నాడు. భిక్షాటనతో పాటు సరాఫా బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ.. ప్రతిరోజూ రూ.400–500 వరకు వసూలు చేస్తున్నాడని సమాచారం.
జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ, మంగీలాల్‌పై పలువురు ఫిర్యాదులు వచ్చినందున మహిళా శిశు అభివృద్ధి శాఖ అతని గురించి ఆరా తీసినట్లు తెలిపాడు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి రాజీష్ సిన్హా మాట్లాడుతూ..భిక్షాటనను ప్రోత్సహించే లేదా దానిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


