దశాబ్దాలుగా గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు కీలకంగా ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఆ సంస్థల సృష్టకర్తలే తమ వ్యాపార సామ్రాజ్యాలను తరలిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జి బ్రిన్ తమ వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాలను కాలిఫోర్నియా నుంచి ఇతర ప్రాంత్రాలకు మారుస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది. వీరితో సంబంధం ఉన్న పలు సంస్థలు మూతపడగా, అవి ఇప్పుడు నెవాడా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి తక్కువ పన్నులు ఉన్న రాష్ట్రాల్లో తిరిగి రిజిస్టర్ అవుతున్నాయి.
పన్నుల భయం.. బిలియనీర్ల పయనం
ఈ నిష్క్రమణకు ప్రధాన కారణం కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వెల్త్ ట్యాక్స్’ (సంపద పన్ను). బిలియన్ డాలర్లకు మించి సంపద ఉన్న నివాసితులపై ఒకేసారి భారీ పన్ను విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు, ఈ పన్ను గత కాలానికి కూడా వర్తించేలా (Retroactive) ఉండవచ్చనే చర్చలు సాగుతుండటం టెక్ కుబేరులను అప్రమత్తం చేసింది.
ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలిఫోర్నియా తీసుకోబోతున్న నిర్ణయంవల్ల భారీగా పెట్టుబడులు తరలిపోతాయని, ఇది ఆవిష్కరణలను దెబ్బతీస్తుందని వెంచర్ క్యాపిటలిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే, కుప్పకూలుతున్న ప్రజా వ్యవస్థలను ఆదుకోవడానికి అత్యధిక సంపద కలిగిన వారు బాధ్యత తీసుకోవాలని సామాజిక వాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి వారు ప్రభుత్వం విధించే పన్నులను స్వీకరిస్తామని చెబుతుండగా, మరికొందరు మాత్రం సైలెంట్‌గా సర్దుకుంటున్నారు.
మారిన కాలం.. మారుతున్న బంధం
ఒకప్పుడు కంపెనీలు అంటే ఫ్యాక్టరీలు, పోర్టులు, కార్మికులతో ముడిపడి ఉండేవి. కానీ నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సంపదకు సరిహద్దులు లేవు. కేవలం కాగితాలపై సంతకాలతో ప్రపంచంలో ఎక్కడికైనా మేధోసంపత్తిని సులువుగా తరలించవచ్చు. ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలతో ముందుకుసాగుతుంటే టెక్ బిలియనీర్లు మాత్రం అందుకు అనుగుణంగా తమ స్థావరాలను మార్చుకుంటున్న తీరు కొంత ఆందోళన కలిగిస్తుంది.
బాధ్యత ఎవరిది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ ద్వారా సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్న తరుణంలో ఈ సంక్షోభం ఒక్క కాలిఫోర్నియాకే పరిమితం కాదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీరు వలస వెళ్లిన చోటల్లా ఇలాగే కొత్త పన్ను విధానాలు తీసుకొస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్థిరమైన ప్రాంతంలో ప్రజా వనరుల ద్వారా ఎదిగి, ఇప్పుడు ఆ వ్యవస్థతో బంధం తెంచుకుంటున్న ఈ డిజిటల్ వలసలు అనేక ప్రశ్నలను మిగుల్చుతున్నాయి.
ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు


