ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అసాధారణ మైలురాయిని చేరాయి. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ లోహం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకవైపు విశ్లేషకులు ధరల దిద్దుబాటు(Correction)పై హెచ్చరిస్తున్నప్పటికీ, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాత్రం వెండి భవిష్యత్తుపై అత్యంత ధీమాతో ఉన్నారు.
గతంలో వెండి ఎప్పుడూ బంగారం ధరల గమనాన్నే అనుసరిస్తూ ఉండేది. కానీ 2025లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లుగా.. ధరలు తాత్కాలికంగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ వెండి మెరుపు కొనసాగుతుంది. వెండి కథ ఇప్పుడే ప్రారంభమైందని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఏడాదిలో వెండి ధర ఏకంగా 125 శాతం పెరిగింది. బంగారం కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, దాని వృద్ధి 63 శాతం మాత్రమే. అంటే బంగారం కంటే వెండి రెట్టింపు రాబడిని అందించింది. వెండి అటు విలువైన ఆభరణంగానూ, ఇటు కీలకమైన పారిశ్రామిక లోహంగానూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో వెండి పాత్ర ఎంతో కీలకంగా మారింది.
సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. డేటా సెంటర్ల విస్తరణ, ఎలక్ట్రికల్ వాహనాల విద్యుదీకరణలో దీని డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యాధునిక రక్షణ పరికరాల్లో వెండి కీలక అంశంగా ఉంది. భారతదేశంలో వెండి ఉత్పత్తిదారుగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ద్వారా ఈ పెరుగుతున్న పారిశ్రామిక అవసరాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?


