జమ్ము ఉదంపూర్‌లో ఎన్‌కౌంటర్
జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు బుధవారం స్పెషల్ ఆపరేషన్‌తో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ గుహలో తలదాచుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పక్కా సమాచారం అందుకున్న బలగాలు ఎన్‌కౌంటర్‌లో వాళ్లను హతమార్చి ఆపరేషన్ పూర్తి చేశాయి.
భద్రతా దళాలు ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో.. ఆపరేషన్ క్లిష్టంగా మారినా, సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు సాగి వారిని అంతం చేసింది. ఈ ఆపరేషన్‌లో.. గుహ నుంచి రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నారా? అనే అనుమానంతో గాలింప చర్యలను ముమ్మరం చేశాయి.
జైష్-ఎ-మొహమ్మద్ గతంలో కూడా జమ్మూ కశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో ఆ దాడుల ఆగిపోయాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆ సంస్థ యాక్టివ్ అయ్యింది. భద్రతా బలగాలు సకాలంలో స్పందించడంతో దాడుల ముప్పు తప్పింది.
మంగళవారం సైతం ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్, మజల్టా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి. అయితే ఉగ్రవాదులు ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభించాయి. ఇవాళ్టి ఉదంపూర్ గుహ ఎన్‌కౌంటర్‌లో మరణించింది.. ఆ ఉగ్రవాదులే అయ్యి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. దీనిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల కిష్ట్వార్ జిల్లాలో జరిగిన "ఆపరేషన్ త్రాషి-1" పేరిట భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ఆపరేషన్‌లో జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లతో సుదీర్ఘ కాల్పులు జరిగి, ఒక పారా ట్రూపర్ మరణించగా, పది మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా ఉదంపూర్‌లో జరిగిన ఆపరేషన్ దీనికి కొనసాగింపుగా తెలుస్తోంది.


