సారీ నాన్నా..! | 3 Minor Sisters Ends Their Lives By Jumps Off From 9th Floor Due To Online Game Conflict | Sakshi
Sakshi News home page

సారీ నాన్నా..!

Feb 4 2026 9:29 AM | Updated on Feb 5 2026 5:15 AM

Parents Object To Gaming 3 Minor Sisters Jump Off 9th Floor

ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసలై ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

గేమ్స్‌ ఆడొద్దని తండ్రి వారించడంతో విపరీత నిర్ణయం తీసుకున్న వైనం

9 అంతస్తుల భవనం నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి

యూపీ ఘజియాబాద్‌లో ఘటన

ఘజియాబాద్‌: కోవిడ్‌కాలంలో స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోయిన టీనేజర్లలో కొందరు పూర్తిగా ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలై చివరకు వాటికి బలవుతున్న దారుణోదంతం తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఘజియాబాద్‌కు చెందిన ముగ్గురు టీనేజీ అక్కాచెల్లెళ్లు నిషిక(16), ప్రాచీ(14), పఖీ(12) మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో తాము నివసించే అపార్ట్‌మెంట్‌ 9వ ఫ్లోర్‌ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో చిన్నారుల ఫోన్‌ వినియోగం, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వ్యసనం ఎంతటి దారుణాలకు దారితీస్తుందోన్న విస్తృతచర్చలకు తెరలేచింది. 

ఆత్మహత్య ఘటన తెల్సి పోలీసులు రంగంలోకి దిగి వాళ్లింట్లో సోదాలుచేసి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనంచేసుకున్నారు. ఏడుస్తున్న ఎమోజీని జతచేసి ‘ సారీ నాన్నా. నిజంగా సారీ’’ అంటూ పలు వాక్యాలు రాసి ఉన్న లేఖను చూసి తండ్రి చేతన్‌ కుమార్‌ బోరున విలపించారు. షాలిమార్‌ గార్డెన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అతుల్‌ సింగ్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సాహిబాబాద్‌లోని భరత్‌సిటీలో ఉన్న చేతన్‌కుమార్‌ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తుంటాడు. ఇతను ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడాడు. వీళ్లకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కలిగారు.

 అందరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉంటున్నారు. నలుగురు కుమార్తెల్లో నిషిక, ప్రాచీ, పఖీలు కోవిడ్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అందులోనూ ఆన్‌లైన్‌గేమ్‌లకు బాగా అలవాటు పడ్డారు. కొరియన్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటే విపరీతమైన పిచ్చి. దీంతో చదువుల్లో బాగా వెనకబడ్డారు. చివరకు పాఠశాలకు వెళ్లడం మానేశారు. గత రెండేళ్లుగా ముగ్గురూ స్కూల్‌ ముఖం చూడలేదు. ఇంట్లో తమ గదికే పరిమితమయ్యారు. ఎప్పుడూ కలిసి స్నానంచేయడం, తినడం, పడుకోవడం, ఫోన్‌ చూడటం తప్ప మరో పని చేసిందే లేదు. దీంతో ఫోన్‌ వాడకం ఆపేయాలని తండ్రి ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. అయితే మంగళవారం మాత్రం ఈ విషయమై గొడవ జరిగిందని వార్తలొచ్చాయి. 

రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్‌ పదో అంతస్తు ఫ్లాట్‌లో ఉండే అరుణ్‌ అనే వ్యక్తి తన బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు. అదే సమయానికి ఈ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తులోని తమ బాల్కనీ వద్దకు చేరుకున్నారు. పెద్దవాళ్లు ఇద్దరు హత్తుకుని ఒక్కటిగా కిందకు పడిపోగా వాళ్లను పట్టుకోబోయి చిన్న చెల్లెలు సైతం కిందకు పడటం చూసి హుతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ముగ్గురు హాహాకారాలు చేస్తూ కిందకు దూకడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఉలిక్కిపడ్డారు. నేలపై రక్తపుమడుగులో పడి ఉన్న ముగ్గురినీ సమీప లోనీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.

కొరియాకు వెళ్తామనేవారు..
ఘటనపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు ఫోన్‌ చూస్తున్నారని అనుకున్నా. గేమ్స్‌ ఆడుతున్నారనిగానీ, టాస్క్‌లు ఉండే ఆన్‌లైన్‌ ఆటలాడుతున్నారని గానీ నాకు తెలీదు. ఒక గేమ్‌నయితే వాళ్లు దాదాపు మూడేళ్లుగా ఆడుతున్నారు. మేం కొరియాకు వెళ్లొస్తామని తరచూ నాతో అనేవాళ్లు. భయంకరమైన టాస్క్‌లు గేమ్‌లో ఉంటాయని నాకు తెలియదు. వీళ్ల మొబైల్‌ ఫోన్లను పోలీసులు పరిశీలించాకే నాకీ విషయం తెల్సింది. గేమ్‌ల సంగతి తెలిస్తే ముందే వీళ్లను హెచ్చరించేవాడిని. కనీసం ఫోన్లు ఇచ్చేవాడినే కాదు. 

వ్యసనపరులుగా మారేదాకా ఏ తండ్రీ చూస్తూ ఊరుకోడు’’ అని తండ్రి ఏడుస్తూ చెప్పారు. గేమ్‌లో ప్రాచీ బాస్‌గా ఉండేదని, అక్క నిషిక, చెల్లి పఖీ ఈమె ఆదేశాలను శిరసావహించేవారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో 14 ఏళ్ల బాలుడు ప్రమాదకర బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ఘజియాబాద్‌ ఉదంతం గుర్తుకుతెస్తోంది. ఆనాడు రష్యాలో మొదలైన ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మధ్యాసియా దేశాల్లో 130 మంది ప్రాణాలుతీసింది. గేమ్‌ మొదలెట్టిన 50 రోజుల్లోపు గేమ్‌ ఆడే వ్యక్తి మరణించేలా అందులో టాస్క్‌లు ప్లాన్‌చేశారు.   
 

ఇది కూడా చదవండి: తేనెటీగల దాడి: పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన వంట మనిషి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement