సాక్షి,బళ్లారి: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని, కుమారుడి భవిష్యత్తు కోసం కలలు కన్న తండ్రిని, ఆప్యాయత అనురాగాలను పంచిన సోదరిని కూడా ఓ కర్కోటకుడు దారుణంగా హత్య చేసిన ఘటన విజయనగర జిల్లా కొట్టూరులో వెలుగు చూసింది. కొట్టూరు పట్టణంలో కన్న తల్లిదండ్రులను, సోదరిని హత్య చేసిన నిందితుడు అక్షయ్ బెంగళూరులోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిదండ్రులు, సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
అయితే అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తల్లిదండ్రులు భీమరాజ్(50), జయలక్ష్మి(45), సోదరి అమృత(17)లను తానే హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టానని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సమాచారాన్ని విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవికి అందించారు. దీంతో ఎస్పీ నేతృత్వంలో కొట్టూరు డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, సీఐ, వేలిముద్రల నిపుణులు, జాగిలంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరో వైపు నిందితుడిని వెంటబెట్టుకొని బెంగళూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఎందుకు, ఎప్పుడు హత్య చేశాడు? అనే కోణంలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కొట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.


