పిల్లలు ప్రయోజకులుగా ఎదిగినప్పుడే తల్లిదండ్రుల జీవితానికి నిజమైన ఆనందం.. తమ పిల్లల క్షేమం కోసం వారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. తనను కష్టపడి పెంచిన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలనుకున్నాడు ఓ యూట్యూబర్.. తన కన్నవారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. మరపురాని క్షణాలను ఆవిష్కరించాడు. యూట్యూబర్ ధర్మేంద్ర బిలోటియా తన తల్లిదండ్రులకు హెలికాప్టర్ రైడ్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
తల్లిదండ్రులకు తొలిసారి హెలికాప్టర్ ఎక్కించాడు. ఈ భావోద్వేగ క్షణాలను వీడియోలో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. ధర్మేంద్ర బిలోటియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన తన తల్లిదండ్రుల మధ్య నిలబడి ఉండగా.. వెనుక హెలికాప్టర్ కనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో.. ఆ ప్రయాణం గురించి ఎలా అనిపించిందని ఆయన తన తల్లిదండ్రులను అడగ్గా.. వారు బాగుందంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
హెలికాప్టర్‌లో ధర్మేంద్ర తల్లిదండ్రులు పక్కపక్కనే కూర్చుని.. కిటికీలోంచి కనిపిస్తున్న అద్భుతమైన ఆకాశ దృశ్యాలను చూస్తూ ఎంతో ప్రశాంతంగా.. ఆశ్చర్యంగా.. సంతోషంగా కనిపించారు. ‘‘ఒకప్పుడు గ్రామ పొలాల్లో నిలబడి ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల వైపు చూసిన నా తల్లిదండ్రులు.. ఈరోజు అదే హెలికాప్టర్ లోపల కూర్చున్నారు. మట్టి నుండి ఆకాశపు ఎత్తుల వరకు వారు చేరుకున్నారు’’ అంటూ ధర్మేంద్ర ఈ వీడియోకు ఒక భావోద్వేగ క్యాప్షన్ ఇచ్చారు.

తమ తల్లిదండ్రులు ఎప్పుడూ ఊహించని ఒక కలను నిజం చేసిన కొడుకు పట్ల నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తల్లిదండ్రులకు కేవలం వస్తువులను బహుమతిగా ఇవ్వడం కంటే, ఇలాంటి మధురమైన అనుభూతులను అందించడం గొప్ప విషయమని వేల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా గాజియా గ్రామానికి చెందిన ధర్మేంద్ర బిలోటియా ఆగస్టు 25, 1995 సంవత్సరంలో జన్మించాడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ధర్మేంద్ర.. చిన్ననాటి నుంచి పలు ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి కోసం కష్టపడ్డాడు. హాస్యం, కథ చెప్పే నైపుణ్యం ఆయనను సోషల్ మీడియా స్టార్‌గా మార్చింది. తాజాగా తల్లిదండ్రులకు మొదటి హెలికాప్టర్ రైడ్ సర్‌ప్రైజ్.. ఇచ్చిన వీడియో వైరల్‌గా మారింది.


