విలేకరుల సమావేశంలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్. చిత్రంలో కమిషనర్లు ఎస్.ఎస్. సంధూ, వివేక్ జోషి
కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల్లో..
తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో.. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్‌లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది.

హింస, ప్రలోభాలకు తావు లేకుండా
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.

8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.


