మామ ఆస్తుల వివరాల్ని అల్లుడికి ఇవ్వలేం | We cannot give the details of the uncle property to the son in law | Sakshi
Sakshi News home page

మామ ఆస్తుల వివరాల్ని అల్లుడికి ఇవ్వలేం

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

We cannot give the details of the uncle property to the son in law

యూపీ సహ చట్టం కమిషనర్‌ స్పష్టీకరణ

లక్నో: మామ వ్యక్తిగత వివరాలైన వేతనం, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని సహ చట్టం కింద అతడి అల్లుడికి ఇవ్వలేమని యూపీ సమాచార హక్కు కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కమిషనర్‌ మహ్మద్‌ నదీమ్‌ జనవరి 7వ తేదీన జారీ చేసిన ఆదేశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్‌ కోర్టు కేసులకు అవసరమైన ఆధారాలను అందించడం, వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకోవడం సహచట్టం ఉద్దేశం కాదని స్పష్టత ఇచ్చారు. ఆస్తులు, వేతనం, పింఛను తదితర వ్యక్తిగత వివరాలను వేరెవ్వరికీ ఇవ్వరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందంటూ గుర్తు చేశారు. 

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2015 జనవరి ఒకటో తేదీన రిటైరైన రిషిపాల్‌ సింగ్‌ ఆస్తులు, పింఛను వివరాలను అందజేయాలంటూ కుల్వంత్‌ సింగ్‌ అనే వ్యక్తి బిజ్నోర్‌ జిల్లా నజిబాబాద్‌ తహశీల్దార్‌కు 2025 జూలై 27వ తేదీన సహచట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. రిషిపాల్‌ సింగ్‌ కుమార్తె భర్త, సొంత అల్లుడే కుల్వంత్‌ సింగ్‌. రూ.26 లక్షల కట్నం కోసం వేధిస్తున్నానంటూ భార్య తనపై కట్నం వేధింపుల కేసు పెట్టిందని, ఈ కేసుకు మామ ఆర్థిక స్థితిగతుల వివరాలు అవసరమని అతడు పేర్కొన్నాడు. ఈ దరఖాస్తుపై నజిబాబాద్‌ తహశీల్దార్‌ సమాధానమివ్వలేదు. దీంతో, కుల్వంత్‌ సింగ్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు. ‘ఈ సమాచారం కోరిన వ్యక్తి బయటి వాడు కాదు, అతడి సొంతల్లుడే. 

ఈ సమాచారం వ్యక్తిగత అవసరాల కోసమే తప్ప, విస్తృత ప్రజా ప్రయోజనం కోసం మాత్రం కాదు. పైపెచ్చు ఇది కట్నం వేధింపుల కేసు. మామ తనకు రూ.26 లక్షలు ఇవ్వగల సత్తా ఉండి కూడా కుమార్తెతో వేధింపుల కేసు పెట్టించాడని వాదించేందుకు దీనిని వాడుకోవాలనుకున్నాడు. అందుకే అతడి దరఖాస్తును తిరస్కరించాం’అని రాష్ట్ర సహ కమిషనర్‌ నదీమ్‌ చెప్పారు. అంతగా కావాలంటే అతడు కోర్టుకు వెళ్లవచ్చన్నారు. కోర్టు అంగీకారంతో సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement