ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. మావోలు కదలికల సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోలు తారసపడ్డారు. దీంతో బలగాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగటంతో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఒక ఏకే 47, పిస్టల్, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
కాగా, ఈ నెల 22న(గురువారం) జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా చోటానాగ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో కుంబాదీహ్ గ్రామ సమీపంలో గల చైబాస అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరాం మాంఝీ అలియాస్ అనల్‌దా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో అనల్‌దా మృతిచెందినట్టు కొల్హాన్ డివిజన్ డీఐజీ అనురంజన్ కిస్పొట్టా ధ్రువీకరించారు. జార్ఖండ్‌లోని పిట్రాండ్‌కు చెందిన అనల్‌దా 1987 నుంచి క్రియాశీలకంగా ఉన్నారు.
ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టులకు దండకారణ్యంలో ఉన్న సేఫ్ జోన్లు క్రమంగా ప్రమాదంలో పడ్డాయి. దీంతో ఒకప్పటి పీపుల్స్‌వార్‌కు చెందిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకోగా, మావోయిస్టు పార్టీలో విలీనమైన ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్)కి సంబంధించిన కీలక నేతలు ఒడిశా–జార్ఖండ్ సరిహద్దులో విస్తరించిన శరందా అడవులను షెల్డర్ జోన్‌గా మార్చుకున్నారు.


