శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న మంచు, శీతల గాలుల కారణంగా స్థానికులు గజగజా వణికిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. కశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో మంచు గడ్డలు విరిచిపడ్డాయి. దీంతో, అక్కడున్న టూరిస్ట్ రిసార్ట్ దెబ్బతిన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోన్‌మార్గ్‌లో మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో హిమపాతం సంభవించింది. మంచు గడ్డలు, పెళ్లలు (అవలాంచీ) ఏర్పడ్డాయి. రాత్రి 10:12 గంటల సమయంలో సెంట్రల్ గందర్‌బల్ జిల్లాలోని రిసార్టుల మీద అవలాంచీ విరుచుకుపడ్డింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉప్పెనలా అవలాంచీ భవనాలను కప్పేయడం ఇందులో కనిపిస్తోంది.
అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రిసార్టుల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదకర అవలాంచీ సంభవించే అవకాశం ఉందని సోమవారం నాడే హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటలుగా సోన్‌మార్గ్‌తో పాటు కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ హిమపాతం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్‌మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్తవార్ ప్రాంతాల్లో రోడ్ల మీద రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతోంది.
Dapaan there's been an avalanche in Sonamarg.
Praying for everyone's safety. 🙏🏻 pic.twitter.com/aIqALHSq21— Basharat Rehan🇵🇸 (@BasharatRehan1) January 28, 2026
శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలంగా ఉందని, మంచు కురుస్తూనే ఉందని ఏఏఐ పేర్కొంది. దీంతో శ్రీనగర్‌కు రావాల్సిన 25.. అక్కడి నుంచి బయలుదేరాల్సిన మరో 25 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. విమానాల రద్దు కారణంగా అక్కడికి వెళ్లిన అనేక మంది పర్యాటకులు శ్రీనగర్‌లోనే చిక్కుకుపోయారు.


