ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి. ఫలానా ఆహారం ఇలా తింటే ఈ లాభాలనీ, ఫలానా పదార్థాలతో ఇవీ ప్రయోజనాలంటూ రకరకాల సలహాలూ, సూచనలూ నెటిజనులను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందులో ఒకటి... ఆపిల్‌ను తొక్కతో సహా పరగడుపునే తీసుకుంటే దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు తగ్గుతాయన్నది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం!
వాస్తవాలేమిటంటే...
ఆపిల్ స్కిన్‌లో చాలారకాల పోషకాలున్న మాట వాస్తవమే. ఉదాహరణకు మలబద్ధకాన్ని తొలగించే పీచు, వ్యాధి నిరోధకశక్తిని సమకూర్చే విటమిన్ సి, ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి నివారణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశాలున్నాయి.
అయితే సాధారణంగా ఆపిల్ తొక్క మెరిసేలా చేయడానికి చాలామంది ఒక రకం మైనపుపూత (వ్యాక్స్)తో ఆపిల్‌కు మెరుపు తెప్పించి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు కాబట్టి తొక్కతో తినాలనుకునేవారు వీలైనంతగా కడిగి తినడం మేలు.
అదో అపోహ మాత్రమే...
పరగడుపున పొట్టుతోనే ఆపిల్ తినడం వల్ల తలనొప్పులు తగ్గుతాయనుకోవడం అపోహ మాత్రమే. తలనొప్పులు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఉదాహరణకు ఒంట్లో నీటి మోతాదు తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి. తొక్కతో సహా తినడం వల్ల దేహం రీహైడ్రేట్ కావడం, ఒత్తిడి తగ్గడం వంటివేమీ జరగవు. కాబట్టి తొక్క వల్ల తలనొప్పులు తగ్గడమనేది అపోహేనని నిపుణుల అభిప్రాయం.
అయితే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ గుణాలు కూడా ఉన్నందువల్ల నొప్పి తగ్గడంలో అవి కొంత ఉపయోగపడవచ్చు గానీ... ఉదయం పరగడుపున తొక్కతో ఆపిల్ తినడం వల్లనే తలనొప్పుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందనుకోవడం మాత్రం అపోహ అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అయినా ‘ప్రతి రోజూ ఆపిల్ తింటే... వైద్యుడి దగ్గరకు వెళ్లక్కర్లేదు’ (ఏన్ ఆపిల్ ఏ డే... కీప్స్ ద డాక్టర్ అవే) అనే సూక్తి ప్రకారం ఆపిల్‌ను బాగా కడిగాక తొక్కతో తినడంలో ప్రయోజనమే తప్ప నష్టమీదీ ఉండదనేది ఆహార నిపుణుల మాట.


