ఒస్లో: నార్వే రాజ కుటుంబాన్ని గత రెండేళ్లుగా కుదిపేస్తున్న లైంగిక దాడుల కేసులో కీలక తీర్పు వెలువడింది. నార్వే యువరాణి మెట్టే మారిట్(Mette-Marit) కుమారుడైన మారియస్ బోర్గ్ హోయిబీ(Marius Borg Hoiby)పై నమోదైన అత్యాచారం, గృహహింస, బెదిరింపులు తదితర కేసుల్లో ఓస్లో జిల్లా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, ఈ కేసు నార్వే చరిత్రలో రాజ కుటుంబానికి సంబంధించిన అత్యంత వివాదాస్పద నేర విచారణల్లో ఒకటిగా నిలిచింది. నెలల తరబడి సాగిన దర్యాప్తు, ఆరు వారాలకు పైగా కొనసాగిన విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఎవరు మారియస్?
మారియస్ బోర్గ్ హోయిబీ నార్వే యువరాణి మెట్టే-మారిట్‌కి మొదటి వివాహం ద్వారా జన్మించాడు. 2001లో ఆమె యువరాజు హాకోన్‌ను వివాహం చేసుకుంది. అనంతరం, మారియస్ కూడా రాజకుటుంబంలో భాగమయ్యాడు. అయితే అతనికి రాజవంశ వారసత్వ హక్కులు లేదా అధికారిక రాజకుటుంబ హోదా లేవు. అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే రాజకుటుంబ సభ్యుడిగా ప్రజల దృష్టిలో ఉన్నాడు.
ఏయే ఆరోపణలు ఎదుర్కొన్నాడు?
ప్రాసిక్యూషన్ ప్రకారం, మారియస్‌పై మొత్తం 40 వరకు క్రిమినల్ ఆరోపణలు నమోదయ్యాయి. వాటిలో.. నాలుగు అత్యాచార ఆరోపణలు, మహిళలపై లైంగిక దాడులు, గృహహింస, బెదిరింపులు, నిరోధాజ్ఞ (Restraining Order) ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసులు ఉన్నాయి. దీంతో, ప్రాసిక్యూటర్లు అతడికి 7 సంవత్సరాల 7 నెలల జైలు శిక్ష విధించాలని కోరగా, కోర్టు చివరకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది.
కోర్టు ఏం తేల్చింది?
కోర్టు రెండు అత్యాచార కేసుల్లో మారియస్‌ను దోషిగా నిర్ధారించింది. మరికొన్ని అత్యాచార ఆరోపణల నుంచి అతడికి విముక్తి లభించినప్పటికీ, గృహహింస మరియు ఇతర నేరాల్లో కూడా దోషిగా తేలాడు. విచారణ సమయంలో బాధిత మహిళల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్ డేటా, సందేశాలు, వీడియో ఆధారాలు తదితర అంశాలను కోర్టు పరిశీలించింది. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు నార్వే సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి.
మరోవైపు.. మారియస్ అత్యాచార ఆరోపణలను ఎప్పటి నుంచో ఖండిస్తున్నాడు. తాను అత్యాచారాలకు పాల్పడలేదని, అయితే కొన్ని చిన్న నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, దాడి వంటి ఆరోపణలను మాత్రం అంగీకరించాడు. తీర్పుపై అప్పీల్ చేసే హక్కు అతనికి ఉంది.
రాజ కుటుంబంపై తీవ్ర ప్రభావం
ఈ కేసు నార్వే రాజ కుటుంబ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. విచారణ సమయంలో రాజ్యాంగ రాజరిక వ్యవస్థపై ప్రజల మద్దతు కూడా తగ్గిందని సర్వేలు సూచించాయి. అయితే ఇటీవలి నెలల్లో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ పరిణామాల మధ్య యువరాణి మెట్టే-మారిట్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ప్రస్తుతం ఊపిరితిత్తుల మార్పిడి (Lung Transplant) కోసం వేచి ఉన్నట్లు సమాచారం. తన తల్లి ఆరోగ్య పరిస్థితి కారణంగా తాత్కాలిక విడుదల కోరిన మారియస్ అభ్యర్థనను కూడా అప్పీల్ కోర్టు తిరస్కరించింది.
నార్వేలో చర్చనీయాంశం
రాజ కుటుంబానికి సమీప వ్యక్తి అయినప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని మహిళా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. రాజకీయ, సామాజిక వర్గాలు కూడా నార్వే న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశంసిస్తున్నాయి.


