‘వైకింగ్ రో’తో హోరెత్తిన వీధులు
క్వార్టర్స్‌లో ఓడినా... అభిమానులు బ్రహ్మరథం
ఓస్లో (నార్వే): ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఓడి ఇంటి బాట పట్టిన నార్వే ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన నార్వే... ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను బోల్తా కొట్టించడంతోపాటు ఈ టోర్నీ మొత్తం నార్వే అద్భుత ప్రదర్శన కనబర్చింది. స్టార్ స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ ఏడు గోల్స్‌తో జట్టును ఒంటిచేత్తో నడిపించగా... మైదానం బయట అభిమానులంతా ‘వైకింగ్ రో’ సంబరాలతో ప్రత్యేకత చాటుకున్నారు.
గ్రూప్ ‘ఐ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 6 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధించిన నార్వే జట్టు... ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. రౌండ్–32లో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించిన నార్వే... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. దీంతో నార్వే పేరు మారుమోగిపోయింది. ఆరున్నర అడుగుల స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ 5 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ సాధించడంతో పాటు... తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన అనంతరం సోమవారం స్వదేశానికి చేరుకున్న టీమ్‌కు... అభిమానులకు అనూహ్య స్వాగతం పలికారు.
వేలాది మంది అభిమానులు విమానాశ్రయానికి చేరుకొని ‘వైకింగ్ రో’ సంబరాలతో హోరెత్తించారు. కనుచూపు మేరంతా అభిమానులతో విమానాశ్రయం జనసంద్రాన్ని తలపించగా... అనంతరం టీమ్ ప్లేయర్లు ఓపెన్ టాప్ బస్సులో ముందుకు సాగారు. దారి పొడవునా అభిమానులు ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలుపుతుండగా... నార్వే యువరాజు హాకాన్ డ్రమ్స్ వాయిస్తూ ‘వైకింగ్ రో’ సంబరాలకు నేతృత్వం వహించడం విశేషం. క్వార్టర్ ఫైనల్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన నార్వే... అదనపు సమయంలో బెలింగ్‌హామ్ చేసిన గోల్‌తో ఇంగ్లండ్ జట్టు ముందంజ వేసింది.
ఏంటీ వైకింగ్...
వరల్డ్‌కప్ సమయంలో నార్వే ప్లేయర్లు, అభిమానులు, ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ ‘వైకింగ్ రో’ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఇంతకూ ఏంటీ ‘వైకింగ్ రో’... ఎందుకు దానికి అంత ప్రత్యేకత అంటే... ఇది ప్రాచీన నౌకాయాన సంస్కృతికి నిదర్శనం. క్రీస్తు శకం 8వ శతాబ్ద కాలంలో సముద్రయానానికి ప్రత్యేకమైన పడవలు వినియోగించేవారు. లాంగ్‌షిప్స్ అని పిలుచుకునే తేలికపాటి చెక్క పడవలను నడపడంలో నార్వే ప్రజలు అప్పట్లో సిద్ధహస్తులు.

సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వైకింగ్ యోధులంతా ఒక లయతో... క్రమశిక్షణతో కలిసికట్టుగా పడవలను ముందుకు నడిపేవారు. ఇది వారి బృంద స్ఫూర్తిని ప్రస్ఫుటించేంది. అయితే ఆధునిక కాలంలో వైకింగ్ పడవలు లేకపోయినా... తమ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తున్న నార్వే ప్రజలు... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్లేయర్ల ‘టీమ్ స్పిరిట్’కు చిహ్నంగా మైదానంలో ‘వైకింగ్ రో’ సంబరాలు ప్రారంభించగా... అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్‌గా మారిపోయింది.


