స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలోని భావోద్వేగాలను గౌరవించడం, పద్ధతి మార్చుకోవడం చేతకాకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ కేసులో అతనికి మొదట 10 లక్షల జరిమానా విధించిన సుప్రీం చివరికి రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహనలతో కూడిన ధర్మాసనం, రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని జమ చేయాలని అతనిని ఆదేశించింది. అలా చేయని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
అసలు ఏం జరిగిందంటే..
‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధి చికిత్సకు అయ్యే భారీ ఖర్చులపై, అలాగే వైకల్యం ఉన్న ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తూ సమయ్ రైనా అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆ షోకు వెళ్లిన ఒక యువతిని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మీ బ్యాంకు ఖాతాలోకి రూ.16 కోట్లు వస్తే... మీరు కనీసం ఒక్కసారైనా మీ భర్త వైపు చూసి...ద్రవ్యోల్బణం పెరుగుతోంది' అని అనరా?’’ అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలు తావిచ్చింది. తన వ్యాఖ్యలపై సమయ్ రైనా సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పినప్పటికీ వివాదం చల్లారలేదు.
సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 'క్యూర్ ఎస్‌ఎమ్‌ఏ ఇండియా ఫౌండేషన్' (Cure SMA India Foundation) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ షో హోస్ట్ సమయ్ రైనాతో పాటు విపున్ గోయల్, బాల్‌రాజ్ పరమ్‌జీత్ సింగ్ ఘై, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వంటి ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా ఈ పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. క్యూర్ ఎస్‌ఎమ్‌ఏ ఫౌండేషన్ తరపు న్యాయవాది అపరాజిత సింగ్ కోర్టులో వాదిస్తూ.. సమయ్ రైనాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఆయన ఒక అహంకారి అని మండిపడ్డారు. షోలలో "Specially abled" అనే పదానికి బదులుగా "Disabled" (వికలాంగులు) అనే పదాన్ని వాడటాన్ని ఆమె తప్పుపట్టారు
అయితే, రైనా తరపు న్యాయవాది క్షమాపణ కోరుతూ మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించడంతో, ఆ జరిమానాను రూ. 3 లక్షలకు తగ్గించింది. ఒకవేళ తదుపరి విచారణ సమయానికి కోర్టుకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే రూ. 30 లక్షల జరిమానా విధిస్తామని కూడా ధర్మాసనం హెచ్చరించింది.
కోర్టు ఆదేశాలు ఏమిటి?
గతేడాది ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కమెడియన్లకు ఒక సామాజిక బాధ్యతను అప్పగించింది. ప్రత్యేక సామర్థ్యాలు (Specially-abled) ఉండి, స్ఫూర్తిదాయకమైన కథనాలు కలిగిన వ్యక్తుల కోసం ప్రతి నెలా సమయ్ రైనా తన ప్లాట్‌ఫారమ్‌లలో ఫండ్ రైజింగ్ (నిధుల సేకరణ) షోలను నిర్వహించాలని ఆదేశించింది. ఇది మీపై వేస్తున్న శిక్ష కాదు, సమాజం పట్ల మీ బాధ్యత. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు, మీ పాపులారిటీని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించండి" అని అప్పట్లో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
కోర్టు ఆగ్రహానికి దారితీసిన అంశాలు
నిందితులు దేశం వెలుపల కూర్చుని తాము చట్ట పరిధికి అతీతులమని అనుకుంటున్నారని కోర్టు మండిపడింది. "దీనిని అహంకారం అనకపోతే, మనం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని మార్చాల్సి ఉంటుంది" అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన అఫిడవిట్‌ను నిన్ననే దాఖలు చేశామని రైనా తరపు న్యాయవాదులు చెప్పినప్పటికీ, అసలు ఎలాంటి అఫిడవిట్ దాఖలు కాలేదని ధర్మాసనం గుర్తించింది.
మరోవైపు కోర్టు ఆదేశించినప్పటికీ సమయ్ రైనా తమ ఫౌండేషన్‌ను సంప్రదించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై రైనా న్యాయవాది సమాధానమిస్తూ.. తమ వద్ద ఫౌండేషన్ అడ్రస్ లేకపోవడం వల్లే సంప్రదించలేక పోయామని, త్వరలోనే తమ క్లయింట్‌తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి: "హలో..నేను దివ్య మాట్లాడుతున్నాను": కట్ చేస్తే..రూ. 21 కోట్ల స్కాం


