సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని మనం తప్పక కాపాడాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా సీనియర్ అడ్వొకేట్ అసోసియేషన్ సోమవారం రిటైరైన సీనియర్ లాయర్లు పంకజ్ మిత్తల్, కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ వీఎస్ మోహనలకు ఏర్పాటు చేసిన సన్మాన సభలో సీజేఐ పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి బహిరంగ దూషణలకు దిగడం తీవ్ర కలకలం రేపడంపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘ఆ ఘటనపై నేను వ్యాఖ్యానించదల్చుకోలేదు. చిన్నపిల్లలు మాత్రమే అప్పుడప్పుడూ అలా చేస్తుంటారు. అయితే, మనం రాజ్యాంగ సంస్థల మర్యాదను, గౌరవాన్ని కాపాడాలి. ఇది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా’అని పేర్కొన్నారు.


