రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారి భద్రతకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని పేర్కొంది.
ఇందుకు నాలుగు వారాల గడువును నిర్దేశించింది. రహదారిపై భద్రతపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వాజ్యాలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తాము స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా నివేదికలు సమర్పించకపోవడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశ్నించింది.
పౌరుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన, ప్రాధాన్యత కలిగిన ఇలాంటి అంశాల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టింది. నిబంధనల అమలుపై స్టేటస్ లేదా కంప్లయన్స్ రిపోర్టులను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది.
మోటారు వాహనాల(సవరణ) చట్టంలోని నిబంధనల అమలు, రహదారులపై భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇప్పటివరకు కంప్లయన్స్ నివేదికలు సమర్పించని రాష్ట్రాలకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. రాబోయే నాలుగు వారాల్లోగా నివేదికలు సమర్పించని పక్షంలో సంబంధిత రాష్ట్రాల అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రహదారి భద్రత కోసం ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ చేసిన కీలక సిఫార్సులను అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.


