ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న వింత లైంగిక వేధింపుల ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా పురుషులు మహిళలను వేధించే ఘటనలు వెలుగుచూస్తుండగా, ఇక్కడ ఒక మహిళే పురుషుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం గమనార్హం. నగరంలోని ఉమ్రానియే, ఇకిటెల్లి వంటి వివిధ ప్రాంతాల్లోని దుకాణాలు, కార్యాలయాల్లోకి చొరబడుతున్న 30 ఏళ్ల ‘జెడ్‌ఈ’అనే మహిళ, అక్కడ పనిచేసే పురుష ఉద్యోగులను తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాను విద్యార్థినని, ఖర్చుల కోసం సెంటు బాటిళ్లు అమ్ముతున్నానని చెబుతూ లోపలికి ప్రవేశిస్తున్న ఆమె, పురుషులు ప్రతిఘటిస్తే వారిపై దాడికి దిగుతూ, దూషిస్తోంది.
దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, రంగంలోకి దిగిన ఇస్తాంబుల్ పోలీస్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సదరు మహిళను అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను కుచుక్‌సెక్మెస్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, ఆ మహిళ బైపోలార్ డిజార్డర్ (మానసిక రుగ్మత)తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ఆమెను ప్రస్తుతం ఒక ఆరోగ్య సంస్థలో వైద్య పరిశీలనలో ఉంచారు. పురుషులు ఇలాంటి పనులు చేస్తే నేరస్తులని, మహిళ చేస్తే మానసిక రోగిగా ముద్రిస్తారా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చిస్తున్నారు.


