విమానాశ్రయం అనగానే మన కళ్ల ముందు కనిపించేది.. పొడవైన రన్‌వేలు, భారీ టెర్మినల్స్, విమానాల రాకపోకల సందడి. కానీ ప్రపంచంలో ఓ చిన్న దీవిలో మాత్రం విమానాలు దిగే దృశ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ విమానాలకు కాంక్రీట్ రన్‌వే లేదు.. తారు రోడ్డు కూడా లేదు. సముద్ర తీరంలోని ఇసుకే అక్కడ రన్‌వే! అలలు తాకే బీచ్‌పైనే ప్రయాణికుల విమానాలు ల్యాండ్ అవుతాయి.
స్కాట్లాండ్ పశ్చిమ తీరానికి సమీపంలోని బర్రా దీవిలో ఉన్న బర్రా ఎయిర్‌పోర్ట్ (Barra Airport) ఈ అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం నడిచే వాణిజ్య విమానాలు నేరుగా బీచ్‌పై దిగే ప్రపంచంలోని ఏకైక విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది.
స్కాట్లాండ్‌లోని ఔటర్ హెబ్రిడ్స్ (Outer Hebrides) దీవుల సమూహంలో ఉన్న బర్రా ఐలాండ్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ విమానాలు ల్యాండ్ అయ్యే ప్రాంతం పేరు ట్రాయ్ మోర్ (Traigh Mhòr) బీచ్. సాధారణ విమానాశ్రయాల్లో కనిపించేలా ఇక్కడ కాంక్రీట్ లేదా తారు రన్‌వే ఉండదు. గట్టిగా ఉండే ఇసుకనే రన్‌వేగా ఉపయోగిస్తారు. బీచ్‌పై చెక్క స్తంభాలతో మూడు రన్‌వే మార్గాలను గుర్తిస్తారు.
అయితే ఈ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. కారణం.. సముద్రం. హై టైడ్ సమయంలో ఈ బీచ్ మొత్తం నీటిలో మునిగిపోతుంది. అందుకే విమానాల రాకపోకల సమయాలను సముద్ర ఆటుపోట్లను బట్టి నిర్ణయిస్తారు.

విమానం దిగే ముందు.. బీచ్ ఖాళీ!
బర్రా ఎయిర్‌పోర్ట్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విమానాలు లేని సమయంలో అదే బీచ్‌ను ప్రజలు సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. పర్యాటకులు అక్కడ నడవొచ్చు.. ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు.
కానీ విమానం ల్యాండ్ అయ్యే సమయం దగ్గరపడగానే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. బీచ్‌ను ఖాళీ చేయించి.. విమాన రాకపోకలకు సిద్ధం చేస్తారు. ఆకాశం నుంచి విమానం వచ్చి ఇసుకపై సాఫీగా దిగే దృశ్యం పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
పైలట్లకూ ప్రత్యేక సవాలే!
సాధారణ రన్‌వేలతో పోలిస్తే బీచ్‌పై విమానాన్ని ల్యాండ్ చేయడం పైలట్లకు కూడా ప్రత్యేకమైన సవాల్. ఇసుక పరిస్థితి, గాలి వేగం, వాతావరణం, సముద్ర ఆటుపోట్లను పరిగణనలోకి తీసుకుని విమానాలను నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్కాట్లాండ్‌కు చెందిన లాగనైర్ (Loganair) విమాన సంస్థ గ్లాస్గో నుంచి బర్రా వరకు ఈ ప్రత్యేక విమాన సేవలను నిర్వహిస్తోంది.
ప్రయాణమే కాదు.. ఓ ప్రత్యేక అనుభవం
బర్రా దీవి కేవలం ఈ ఎయిర్‌పోర్ట్ వల్లే కాకుండా తన ప్రకృతి అందాలతోనూ ప్రసిద్ధి చెందింది. తెల్లని ఇసుక తీరాలు, నీలిరంగు సముద్రం, తీర ప్రాంత నడక మార్గాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడి ప్రసిద్ధ కిసిముల్ క్యాసిల్ (Kisimul Castle), సముద్ర జీవులు, సంప్రదాయ హెబ్రిడియన్ గ్రామీణ జీవనం సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.
మే నుంచి సెప్టెంబర్ వరకు ది బెస్ట్
బర్రా దీవిని సందర్శించేందుకు సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు అనుకూల సమయంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం మెరుగ్గా ఉండటంతో పాటు.. బీచ్‌పై విమానం దిగే అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో అత్యాధునిక విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. ప్రకృతినే రన్‌వేగా మార్చుకుని విమానాలను ఆహ్వానించే బర్రా ఎయిర్‌పోర్ట్ మాత్రం ప్రత్యేకమే.


