స్కాట్లాండ్‌ చేరిన పురాతన ‘గురు గ్రంథ్ సాహిబ్’ ప్రతి | old Guru Granth Sahib manuscript arrives in Scotland | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్‌ చేరిన పురాతన ‘గురు గ్రంథ్ సాహిబ్’ ప్రతి

Jul 1 2026 1:32 PM | Updated on Jul 1 2026 2:36 PM

old Guru Granth Sahib manuscript arrives in Scotland

ఎడిన్‌బర్గ్: బ్రిటిష్ కాలంలో పూర్వపు సిక్కు సామ్రాజ్యం నుండి తరలించిన 300 ఏళ్ల నాటి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ చేతిరాత ప్రతి ఎట్టకేలకు స్కాట్లాండ్‌కు చేరింది. పంజాబ్ రెండవ పాలకుడైన మహారాజా ఖడగ్ సింగ్‌కు చెందినదిగా భావిస్తున్న ఈ పురాతన ప్రతిని భక్తుల దర్శనార్థం గ్లాస్గోలోని సెంట్రల్ గురుద్వారాలో ఉంచనున్నారు. ఈ అరుదైన ప్రతిని ఎడిన్‌బర్గ్, గ్లాస్గో గురుద్వారా ప్రతినిధులతో కలిసి స్కాట్లాండ్‌కు తీసుకువచ్చినట్లు స్కాట్లాండ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

1700ల కాలానికి చెందిన ఈ చేతిరాత ప్రతిని, 1848లో బ్రిటిష్ వారు పంజాబ్‌లోని దుల్లేవాలా కోటను స్వాధీనం చేసుకున్న సమయంలో మహారాజా ఖడగ్ సింగ్ ఆర్కైవ్స్ నుండి తీసుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత, వలసరాజ్యాల పాలనలో కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా రాణికి అందజేసిన సర్ జాన్ స్పెన్సర్ లాగిన్, ఈ పవిత్ర ప్రతిని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. 2020లో సిక్కు పరిశోధకులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ ద్వారా కళాఖండాల కోసం వెతుకుతుండగా ఈ అరుదైన గురు గ్రంథ్ సాహిబ్ ప్రతికి సంబంధించిన వివరాలు లభ్యమయ్యాయి. నాటి నుంచి దీనిని అత్యాధునిక సాంకేతికతతో పునరుద్ధరించి, భద్రపరిచారు. గత ఏడాది నవంబర్‌లో ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్కాట్లాండ్‌ వ్యాప్తంగా ఉన్న సిక్కు భక్తులు ఈ పవిత్ర గ్రంథాన్ని వీక్షించారు.

తాజాగా దీనిని గ్లాస్గోలోని సెంట్రల్ గురుద్వారాకు తరలించడంతో భక్తులు ఇకపై అక్కడ దర్శించుకోగలుగుతారు. ఈ పవిత్ర ప్రతిని మొదటిసారి చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ‘సిక్కు సంజోగ్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ త్రిష్ణ సింగ్ తెలిపారు. 1930ల చివరి నుండి గ్లాస్గోలో నివసించిన తమ పెద్దలకు, ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన గ్రంథం ఇక్కడే విశ్వవిద్యాలయంలో ఉందనే విషయం తెలియకపోవడం కొంత బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement