Photo Credit: ICC Twitter
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2027 ఫార్మాట్‌లో మార్పులు చేయడం పట్ల స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ ప్రకటన జారీ చేశాయి. ఐసీసీ చేపట్టిన చర్యలు అంతర్జాతీయ క్రికెట్ సమగ్రతను, విశ్వసనీయతను బలహీనపరిచే ప్రమాదం పొంచి ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాయి.
వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి మార్పుల ప్రక్రియను కూడా ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఎత్తి చూపాయి. క్వాలిఫికేషన్ సైకిల్ మధ్యలో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఫార్మాట్‌లను మార్చడం వల్ల జట్ల ప్రణాళికలు దెబ్బతింటాయని, ఇప్పటికే పరిమిత వనరులతో పనిచేస్తున్న బోర్డులపై అదనపు ఆర్థిక, కార్యచరణ భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
‘2027 వన్డే ప్రపంచకప్ పోటీ ప్రారంభానికి 18 నెలల కంటే తక్కువ సమయమే ఉంది. అయితే పురుషుల వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్‌కు అనుసరిస్తున్న నూతన విధానం, టోర్నమెంట్ ఫార్మాట్‌లో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు అమలు చేయాలన్న ఐసీసీ నిర్ణయం పట్ల క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (నెదర్లాండ్స్) బోర్డులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ మార్పులు ఐసీసీలో అసోసియేట్ సభ్యదేశాల క్రికెట్‌కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ప్రపంచ క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఇటీవలి సంవత్సరాల్లో క్రికెట్‌లో సాధించిన పురోగతిని కూడా ఈ మార్పులు దెబ్బతీసే ప్రమాదముంది. క్రికెట్‌లో తమ పరిధిని విస్తరించుకోవాలనే ఐసీసీ ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో అడుగుపెడుతున్న దేశాలకు మాత్రం ఇలాంటి మార్పులు అవకాశాలను తగ్గించేందుకు ఆస్కారముంటుంది.’ అని తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్ ఇదే..
వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. అయితే, అర్హత సాధించిన జట్లలో చివరి మూడు జట్లు సూపర్ సిరీస్‌లో తలపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు మిగతా 11 టీమ్ లతో కలిసి ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించి 30 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. అంతేకాకుండా ఈ రెండు గ్రూప్ ల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన నాలుగో అత్యుత్తమ టీమ్ కూడా అర్హత సాధిస్తుంది. ఈ ఏడు జట్లు మూడో దశ అయిన సూపర్-7లోకి అడుగుపెడతాయి. ఈ రౌండ్‌లో 21 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టాప్-4 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
BIG : Cricket Scotland and KNCB have jointly released a strongly worded statement against the ICC over the 2027 World Cup format changes.
They say the changes were made without meaningful consultation with Associate Members, calling the ICC’s lack of response “disappointing and… pic.twitter.com/p6pN5DjXDX— Ragav X (@ragav_x) August 10, 2026


