ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’ | They won't take either of them: Aakash Chopra on IND stars 2027 WC chances | Sakshi
Sakshi News home page

ODI WC 2027: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’

Aug 6 2026 5:01 PM | Updated on Aug 6 2026 5:08 PM

They won't take either of them: Aakash Chopra on IND stars 2027 WC chances

PC: BCCI X

వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నీలో ఆడబోయే భారత ఓపెనింగ్‌ జోడీ ఎవరన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ వన్డే ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత గిల్‌.. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో మాత్రం వన్‌డౌన్‌లో వచ్చాడు.

గిల్‌కు బదులు
గిల్‌కు బదులు యశస్వి జైస్వాల్‌ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు ఓపెనింగ్‌ చేశాడు. రెగ్యులర్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడం వల్ల జైసూకు జట్టులో చోటు దక్కగా.. గిల్‌ అతడిని ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి.. తాను వన్‌డౌన్‌లో వచ్చాడు.

మరోవైపు.. లార్డ్స్‌లో ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేనే రోహిత్‌ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ అనే ప్రచారం జరిగింది. అయితే, బీసీసీఐతో పాటు రోహిత్‌ ఈ వదంతుల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్‌లో సెంచరీతో కదం తొక్కి తన విలువేంటో చాటుకున్నాడు హిట్‌మ్యాన్‌. అయినప్పటికీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆడించే విషయంలో యాజమాన్యం ఇప్పటికైతే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌తో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరిలో ఒకరు బ్యాకప్‌ ఓపెనర్‌గా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.

 ఆ ఇద్దరికి చోటు దక్కదు
‘‘నిజానికి రుతురాజ్‌ గైక్వాడ్‌ రెండు పనులు చేయగలడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లోనూ రాణించగలడు. అతడు పక్కా ఓపెనింగ్‌ బ్యాటర్‌. కానీ టీమిండియాకు అవసరమైనపుడు మిడిలార్డర్‌లోనూ ఆడాడు.

ఆ స్థానంలో ఫిఫ్టీ, సెంచరీ బాదాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్‌ ఇందుకు విరుద్ధం. అతడు కేవలం బ్యాకప్‌ ఓపెనర్‌గా మాత్రమే ఉండగలడు. ఏదేమైనా ప్రపంచకప్‌ జట్టులో వీరిద్దరికి స్థానం దక్కదని నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

ఇక ప్రపంచకప్‌ జట్టులో ఇద్దరు సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లతో పాటు.. ఇద్దరు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లకు చోటు ఇవ్వాలని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఉంటారు.

ఇక ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లుగా కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ లేదంటే రిషభ్‌ పంత్‌ స్థానం దక్కించుకుంటారు. టాపార్డర్‌ ఎలాగో మారదు. కాబట్టి రుతురాజ్‌ గైక్వాడ్‌ లేదంటే యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువ’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, మిడిలార్డర్‌లో మాత్రం రుతుకు బ్యాకప్‌ బ్యాటర్‌గా చోటు దక్కే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.

చదవండి: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement