source: X
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌కు తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే భారీ ఊరట లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ అద్భుత సెంచరీతో చెలరేగాడు.
మర్రారా క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. 101 పరుగులకే ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది.ఈ దశలో బరిలోకి దిగిన మిరాజ్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి సూపర్ సెంచరీతో మెరిశాడు.
సౌమ్య సర్కార్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివరి వికెట్‌కు సయ్యద్ ఖలేద్ అహ్మద్‌తో కలిసి ఏకంగా 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 141 బంతులు ఎదుర్కొని 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్ పోరాటంతో బంగ్లాదేశ్ 75.5 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది.
బంగ్లా బౌలర్ల మెరుపు ఆరంభం
బ్యాటింగ్‌లో మిరాజ్ ఆదుకోగా.. బౌలింగ్‌లో హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ అదరగొట్టారు. ఆసీస్ ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్, క్యాంప్‌బెల్ కెల్లవేలను తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌కు పంపారు.
అయితే కర్టిస్ ప్యాటర్సన్, జోష్ ఫిలిప్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మూడో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సీఏ ఎలెవెన్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగుఉలు చేసింది.
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ చివరిసారిగా 2003లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత బంగ్లా జట్టు చాలా మెరుగుపడింది.
టెస్టులకు ముందు మంచి సన్నాహకం
ఆస్ట్రేలియాతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ బలమైన జట్టుతో వచ్చింది. తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాదత్ హొస్సేన్, సయ్యద్ ఖలేద్ అహ్మద్, మహ్మద్ ముస్ఫిక్ హసన్‌లతో పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది.


