ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ మధ్యలో మరో సిరీస్‌ ఆడనున్న బంగ్లాదేశ్‌ | Bangladesh Confirmed To Play Separate Tournament In Australia During Test Series | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ మధ్యలో మరో సిరీస్‌ ఆడనున్న బంగ్లాదేశ్‌

Aug 5 2026 4:24 PM | Updated on Aug 5 2026 4:30 PM

Bangladesh Confirmed To Play Separate Tournament In Australia During Test Series

source: X

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఒకేసారి రెండు సిరీస్‌లు ఆడనున్నాయి. సీనియర్‌ పురుషుల జట్టు ఆసీస్‌తో రెండు మ్యాచ్‌ల ద్వైపాక్షిక​ సిరీస్‌ ఆడనుండగా.. బంగ్లాదేశ్‌ హై పెర్ఫార్మెన్స్‌ (HP) జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్‌ 2026లో పాల్గొననుంది.

వార్మప్‌ మ్యాచ్‌తో ప్రారంభం
బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన ఆగస్టు 6న క్రికెట్‌ ఆస్ట్రేలియా XIతో జరిగే మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

ఆ తర్వాత ఆగస్టు 13న డార్విన్‌లోని మారారా క్రికెట్‌ గ్రౌండ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మెక్‌కేలో ఆగస్టు 22న మొదలవుతుంది. 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌ ఇది.

అదే రోజు బంగ్లాదేశ్‌ HP జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్‌లో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. బంగ్లాదేశ్‌ HP జట్టు వరుసగా మూడో ఏడాది టాప్ ఎండ్ టీ20 సిరీస్‌లో పాల్గొంటోంది. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 30 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీఫైనల్స్‌, ఫైనల్‌ ఒకే రోజు నిర్వహించనున్నారు.

ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌ HPతో పాటు నేపాల్‌, న్యూజిలాండ్‌ A, ఆతిథ్య NT స్ట్రైక్‌, హోబార్ట్‌ హరికేన్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, విక్టోరియా జట్లు పాల్గొంటాయి.

2024లో ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌
టాప్ ఎండ్ టీ20 సిరీస్‌ 2024లో అక్బర్‌ అలీ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ HP జట్టు ఫైనల్‌కు చేరింది. అయితే టైటిల్‌ పోరులో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ చేతిలో ఓటమిపాలైంది.

ఆ టోర్నీలో బంగ్లాదేశ్‌ బౌలర్‌ రిపోన్‌ మొండోల్‌ 15 వికెట్లతో అత్యధిక వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో పర్వేజ్‌ హొసైన్‌ ఎమోన్‌ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 186 పరుగులతో ఆకట్టుకున్నాడు.

అయితే 2025 సీజన్‌లో బంగ్లాదేశ్‌ HP ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలే సాధించింది. నేపాల్‌, NT స్ట్రైక్‌పై గెలిచిన బంగ్లాదేశ్‌.. పాకిస్థాన్‌ A, పెర్త్‌ స్కార్చర్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ చేతిలో ఓడిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement