PC: X
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
టీమిండియా రీఎంట్రీలో అదుర్స్
అసలు విషయం ఏమిటంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా టీమిండియా తరఫున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలతో బిజీగా గడిపిన ఇషాన్ కిషన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీమిండియా టెస్టు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లగా ఇషాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు.. ఆర్బీఐ విధుల్లో చేరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.
పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయంలో
కాగా స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఇషాన్ కిషన్‌కు చాన్నాళ్ల క్రితమే ఆర్బీబీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్18 కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం లభించగా.. ఇషాన్ ఆర్బీఐ విధుల్లో చేరాడు.
పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్‌కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. అతడితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.
జీతం ఎంతంటే..?
కాగా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా నెలకు ఇషాన్ కిషన్‌కు రూ. 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రొవిడెంట్ ఫండ్ సహా మిగతా కటింగ్స్ అన్నీ పోనూ చేతికి దాదాపు రూ. 1.12 లక్షలు అందుతున్నట్లు సమాచారం.
ఇక ఆగష్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలోనే మళ్లీ అతడు ఆటతో బిజీ కానున్నాడు. ఈ జట్టుకు బిహార్ చిచ్చరపిడుగు, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్.
కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు 32 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1107, టీ20లలో 1608 పరుగులు.. టెస్టుల్లో 78 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.
చదవండి: అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీ
Indian cricketer Ishan Kishan has reportedly resumed work as an Assistant Manager at the Reserve Bank of India office in Patna during his break from competitive cricket.
Kishan was appointed to the post through the sports quota and was seen carrying out his official… pic.twitter.com/AZPdCflCrM— News18 (@CNNnews18) August 5, 2026


