source: X
దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించింది.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్‌కు సెలెక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు.
ఈ జట్టులో అత్యధికంగా (6) రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నందున శుభ్‌మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23న ప్రారంభం కానుండగా.. అదే రోజు నార్త్ జోన్-వెస్ట్ జోన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
నార్త్ జోన్ జట్టు:
సనత్ సంగ్వాన్, క్వామ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్ (కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్‌దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.
ఎవరీ కన్హయ్య వాధ్వాన్..?
జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ సాధించడంలో వాధ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు.
24 ఏళ్ల వాధ్వాన్ గతేడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 99 పరుగులు చేశాడు. గత ఎడిషన్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడిన అతను, ఇప్పుడు తొలిసారి నార్త్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.


