సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌ | Former India Star Deep Dasgupta Slams Vaibhav Sooryavanshi's Duleep Trophy Vice-Captaincy | Sakshi
Sakshi News home page

సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Aug 1 2026 1:04 PM | Updated on Aug 1 2026 1:12 PM

Former India Star slams Vaibhav Sooryavanshi appointment as Vice captain

PC: BCCI X

ఈస్ట్‌ జోన్‌ వైస్‌ కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్‌ దీప్‌ దాస్‌ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్‌ కెప్టెన్‌ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.

అనుభవం తక్కువ
కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈస్ట్‌ జోన్‌ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్‌కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్‌లు ఆడి 207 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీకి ఏకంగా వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌‍ దీప్‌ దాస్‌ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ..

సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?
‘‘వైభవ్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్‌ రాయ్‌ వంటి సీనియర్‌ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్‌బాల్‌ క్రికెట్‌లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.

15, 16 ఏళ్ల వయసుకే వైభవ్‌ సూర్యవంశీ క్రికెటర్‌గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్‌బాల్‌ క్రికెట్‌లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్‌ కెప్టెన్‌గా బాధ్యత ఇవ్వడం సరికాదు.

అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాడు. వైస్‌ కెప్టెన్‌ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్‌ దాస్‌ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.

మా నిర్ణయం సరైందే
ఇదిలా ఉంటే.. ఈస్ట్‌ జోన్‌ సెలక్టర్‌ ప్రవంజన్‌ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్‌ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్‌ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌ని చేశామని పేర్కొన్నాడు. దులిప్‌ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్‌ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.

చదవండి: ఇంగ్లండ్‌ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement