PC: BCCI
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతడు ప్రస్తుతం జాతీయ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఫిట్‌నెస్ సాధించే క్రమంలో ఈ ముంబైకర్ మకాంను పూర్తిగా బెంగళూరుకు మార్చేశాడు.
హోదా, పేరు కోసం ఆడను
ఈ నేపథ్యంలో తాజాగా ఎస్జీటీవీతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టుకు నాయకుడిగా ఉండాలని చెప్పినపుడు నేను ఏమాత్రం సంకోచించలేదు. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సారథిగా హోదా, పేరు కోసం నేను ఆడను.
జట్టు కోసం మాత్రమే ఆడతాను. ఒక నాయకుడిగా నేనెంత శక్తిమంతుడనో నాకు తెలుసు. కాబట్టి కెప్టెన్సీ అనేది పెద్ద విషయం కాదు. నాయకుడిని కాకపోయినా జట్టులోని మిగిలిన సభ్యులు నా మాట వినేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
కాబట్టి ప్రతీసారి మనకి కెప్టెన్ హోదా అనేది అవసరం లేదు. ఏదేమైనా జాతీయ జట్టుకు సారథ్యం వహించడం అదృష్టం. గొప్ప గౌరవం. ప్రతీ ఆటగాడు టీమిండియాకు ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే ఏదో ఒకరోజు కెప్టెన్ కావాలనే కల కంటాడు.
ఆ అనుభూతి ఐదు నిమిషాలు మాత్రమే
నిజంగానే టీమిండియా సారథిగా వ్యవహరించడం గొప్ప విషయం. అయితే, ఆ అనుభూతి ఐదు నిమిషాలు మాత్రమే. ఆతర్వాత జట్టు కోసం ఆటగాడిగానూ మనం చేయగలమన్న విషయంపైనే మనసు కేంద్రీకృతమై ఉంటుంది.
అయితే, ఆ ఐదు నిమిషాల ఫీలింగ్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవు. కానీ ఎప్పుడు పదవి మన చేజారిపోతుందో తెలియదు. కాబట్టి దానిపై పెద్దగా ఆశలు పెట్టుకోకూడదు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
కాగా 2022లో హార్దిక్ పాండ్యా ఐర్లాండ్‌లో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తంగా 19 మ్యాచ్‌లలకు అతడు సారథ్యం వహించాడు. హార్దిక్ కెప్టెన్సీలో 16 టీ20 మ్యాచ్‌లలో పది గెలిచిన భారత్.. ఐదింట ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసిపోయింది.
హార్దిక్‌కు బదులు సూర్యకు..
తద్వారా హార్దిక్ టీ20లలో 62 శాతం విజయాలు సాధించిన టీమిండియా సారథిగా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలో మూడు వన్డేలు ఆడిన టీమిండియా రెండు గెలిచింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు.
ఈ క్రమంలో హార్దిక్‌కే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రోహిత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించింది యాజమాన్యం. అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యాపై అదనంగా కెప్టెన్సీ భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అప్పట్లో తెలిపాడు.
జట్టులో స్థానమే లేదు
ఇక 2026లో భారత్‌ను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, ఆ వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. జట్టులోనే చోటు లేకుండా చేశారు సెలక్టర్లు. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తాజా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.


