గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో శనివారం (ఆగస్ట్ 1) భారత్‌కు అత్యంత కీలకమైన రోజు కానుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 23 పతకాలు (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్.. ఇవాళ మరిన్ని అద్భుత ప్రదర్శనలు చేస్తే మరో 25 పతకాలు ఖాతాలో చేరే అవకాశం ఉంది.
బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం
భారత్‌కు అత్యధిక పతక అవకాశాలు బాక్సింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్ దాటి ఫైనల్‌కు చేరుకోవడంతో 10 పతకాలు ఖాయమయ్యాయి. వీరిలో ప్రీతి, జాస్మిన్, జడుమణి సింగ్, సాక్షి, ప్రియా, అరుంధతి చౌదరి, లవ్లీనా బోర్గోహైన్, సచిన్, అంకుష్ పాంగల్, నరేందర్ ఉన్నారు.
వీరంతా ఫైనల్స్‌లో విజయం సాధిస్తే భారత్‌కు బాక్సింగ్‌లోనే 10 స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉంది.
అథ్లెటిక్స్‌లో 8 పతకాలపై కన్ను
అథ్లెటిక్స్‌లోనూ భారత్‌కు భారీ అవకాశాలున్నాయి. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు తిరుమారన్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి, రవీనా గాయక్వాడ్, పురుషుల పోల్ వాల్ట్‌లో దేవ్ కుమార్ మీనా, కుల్దీప్ కుమార్ బరిలోకి దిగనున్నారు.
అలాగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్, మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు పతకం కోసం పోటీ పడనుంది.
పారా అథ్లెటిక్స్‌లో 3 అవకాశాలు
పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా, శుభమ్ జుయాల్, పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్లో రమేశ్ షణ్ముగం పతకాల కోసం పోటీ పడనున్నారు.
జూడోలో మరో 4 అవకాశాలు
జూడోలో ఉన్నతి శర్మ, కరణ్‌జిత్ సింగ్ మాన్, హర్ష్ తోకస్, ఇనుంగన్బి తఖెల్లంబమ్ తమ తమ విభాగాల్లో ముందడుగు వేస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.
ఇవాళ భారత్ పతకాల అంచనా
* బాక్సింగ్: 10
* అథ్లెటిక్స్: 8
* పారా అథ్లెటిక్స్: 3
* జూడో: 4
కాగా, ప్రస్తుతం పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాల్టి ప్రదర్శనల తర్వాత ఒక్కసారి భారీ జంప్ కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ స్వర్ణాలు ఎక్కువ సాధిస్తే.. ఆస్ట్రేలియా (128), ఇంగ్లండ్ (80), కెనడా (53) తర్వాత నాలుగో స్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


