జూడోలో బంగారు ధగధగ | Two gold medals for India in judo on the same day | Sakshi
Sakshi News home page

జూడోలో బంగారు ధగధగ

Aug 1 2026 4:10 AM | Updated on Aug 1 2026 4:10 AM

Two gold medals for India in judo on the same day

భారత్‌కు ఒకే రోజు రెండు స్వర్ణాలు

అస్మిత, హర్ష్ కు పసిడి పతకాలు 

రజతం గెలిచిన యామిని

గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో 1990లో జూడోను మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశపెట్టగా... భారత్‌కు ఒక్కసారి కూడా స్వర్ణం లభించలేదు. ఈసారి ఆ లోటును తీరుస్తూ ఒకే రోజు ఇద్దరు భారత జూడో ప్లేయర్లు బంగారు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో హర్ష్ సింగ్‌ (60 కేజీలు), మహిళల 48 కేజీల విభాగంలో అస్మిత డే ఈ ఘనత సాధించారు. శుక్రవారం జరిగిన 60 కేజీల ఫైనల్లో 23 ఏళ్ల హర్ష్ 10–0 ఆ్రస్టేలియాకు చెందిన జోషువా కట్జ్‌ను చిత్తు చేశాడు. నిర్ణీత నాలుగు నిమిషాల సమయంకంటే మరో 41 సెకన్లు మిగిలి ఉండగానే ప్రత్యర్థి ఆటను ముగించడంలో హర్ష్ సఫలమయ్యాడు. 

మహిళల విభాగంలో భారత్‌కు తొలి కామన్వెల్త్‌ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత నిలిచింది. 48 కేజీల ఫైనల్లో అస్మిత 2–1తో హీడీ క్వాచ్‌ (కెనడా)ను ఓడించింది. జూడోలో మనకు మూడో స్వర్ణం గెలుచుకునే అవకాశం చేజారింది. మహిళల 57 కేజీల ఫైనల్లో యామిని మౌర్య ఓడి రజతంతో సంతృప్తి చెందింది. ఇంగ్లండ్‌కు చెందిన అసీలియా టోప్రాక్‌ 100–0 (ఇపాన్‌ స్కోరింగ్‌)తో యామినిపై గెలుపొందింది. రేపటితో ముగియనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో ప్రస్తుతం భారత్‌ 5 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.  

తొలిసారి కామన్వెల్త్‌ బరిలోకి దిగి... 
కామన్వెల్త్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల డిస్కస్‌ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం నెగ్గింది. తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో బరిలోకి దిగిన సీమా డిస్‌్కను 58.65 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది.   

లవ్‌ప్రీత్‌కు రజతం... 
వెయిట్‌లిఫ్టింగ్‌ పురుషుల ప్లస్‌ 110 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్‌ లవ్‌ప్రీత్‌ సింగ్‌ రజతం దక్కించుకున్నాడు. స్నాచ్‌లో 176 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 212 కేజీలు కలిపి మొత్తం 388 కేజీల బరువెత్తిన లవ్‌ప్రీత్‌ రెండో స్థానంతో ముగించాడు. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు ముగిశాయి. భారత్‌ 1 స్వర్ణం, 6 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది.

తండ్రి అండగా నిలవగా... 
అస్మిత డే స్వస్థలం త్రిపురలోని బెలోనియా. తండ్రి సైకిల్‌ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అయితే కూతురు ఆసక్తి చూపించడంతో ఆమెను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. ఆర్థిక సమస్యలతో సతమతమైనా... ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఒకదశలో మోకాలి గాయంతో కెరీర్‌ ఇబ్బందుల్లో పడినా ఢిల్లీలో చికిత్స అందించి ప్రోత్సహించాడు. అయితే అస్మిత కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయాన్ని పంచుకునేందుకు ఆయన లేడు. గత డిసెంబర్‌లో అస్మిత తండ్రి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత కన్నీళ్ళతో తన తండ్రిని గుర్తు చేసుకుంది. 

‘క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా రాని ఊరునుంచి నేను వచ్చాను. కానీ నాన్న మాత్రం నన్ను నమ్మి అన్ని విధాలా అండగా నిలిచాడు. ఆయన అంత్యక్రియలు ముగిసిన పది రోజులకే నాన్న కల నెరవేర్చమంటూ అమ్మ నన్ను మళ్లీ శిక్షణకు పంపించింది. ఈ పతకం కోసం నేను చాలా కష్టపడ్డాను. నా బౌట్‌ల గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక్కడికి వచ్చాక ఎంతో ఒత్తిడికి గురయ్యాను. చివరకు స్వర్ణం సాధించగలిగా’ అని అస్మిత చెప్పింది.  

‘పసిడి’ పంచ్‌లకు గెలుపు దూరంలో 
భారత బాక్సర్లు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన  ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా కనీసం స్వర్ణం లేదా రజతాన్ని ఖాయం చేశారు. మహిళల సెమీఫైనల్స్‌లో అరుంధతి (70 కేజీలు) 4–0తో డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజీ ఎకెల్స్‌ (వేల్స్‌)పై, వరల్డ్‌ చాంపియన్‌ జైస్మిన్‌ (57 కేజీలు) ‘రిఫరీ స్టాప్స్‌ ద కాంటెస్ట్‌’తో రాపెలాంగ్‌ మస్లెలా (లెసోతో)పై, ప్రీతి పవార్‌ (54 కేజీలు) 5–0తో కాథరీన్‌ ఎంవాపె (జాంబియా)పై, సాక్షి (51 కేజీలు) 5–0తో అంబర్‌ జేన్‌వాల్‌ (కెనడా)పై , ప్రియ (60 కేజీలు) 5–0తో లూసీ (ఇంగ్లండ్‌)పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించారు. పురుషుల సెమీఫైనల్స్‌లో జాదూమణి సింగ్‌ (55 కేజీలు) 5–0తో ఫిలిప్‌ హోసెబ్‌ (నమీబియా)ను, అంకుశ్‌ (80 కేజీలు) 5–0తో ఒఫోరి (కెనడా)ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement