1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.
ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.
అభివృద్ధి నిజమే కానీ...
1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.
మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్‌కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది.
భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.
అయినా ప్రపంచ దృష్టి భారత్‌పైనే...
కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.
భారత్‌లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్‌ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది.
1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.
వాస్తవ స్థితి
వీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్‌రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు.
స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.
-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
-టి.ఎన్. నైనన్


