అనిశ్చితి వేళ అత్యయిక భేటీ  | PM Narendra Modi chairs CCS meeting amid West Asia conflict | Sakshi
Sakshi News home page

అనిశ్చితి వేళ అత్యయిక భేటీ 

Jul 31 2026 5:46 AM | Updated on Jul 31 2026 6:35 AM

PM Narendra Modi chairs CCS meeting amid West Asia conflict

భారత్‌పై పశ్చిమాసియా పరిణామాలను విశ్లేషించిన ప్రధాని మోదీ 

భద్రతపై కేబినెట్‌ కమిటీ సమావేశంలో మోదీ సమీక్ష

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు. కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులను పలు అంశాలపై ప్రధాని ఆరా తీశారు. తన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన భద్రతపై కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ ఇంధన అవసరాల కోసం కొనసాగుతున్న దిగుమతుల తీరుతెన్నులు, అవలంభిస్తున్న అంతర్జాతీయ విధానాలను సమీక్షించారు. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య మంత్రి పియూశ్‌ గోయల్, షిప్పింగ్‌ మంత్రి శర్బానంద సోనోవాల్, పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌ పురితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హార్మూజ్‌ జలసంధి, నల్ల సముద్ర, ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ మార్గాల ద్వారా పెట్రోలియం, సహజవాయువు, ఎరువుల దిగుమతి తీరుతెన్నులపై కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి, భద్రతపై దాని దుష్ప్రభావాలు, దేశీయంగా ద్రవరూప సహజ వాయువు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, పెట్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు భారత్‌ ఆ మేరకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి విడమర్చి చెప్పారు. ఎల్పీజీని విభిన్న దేశాల నుంచి సమీకరిస్తున్నామని, సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయని సోమనాథన్‌ వెల్లడించారు. రైతులుకు ఎల్లవేళలా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశించారు. హార్మూజ్‌ జలసంధి, సమీప సముద్ర జలాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే సరకు రవాణా నౌకల్లోని భారతీయ నావికులు, సిబ్బంది రక్షణపై మోదీ ఆరాతీశారు. భారతీయ సిబ్బంది యోగక్షేమాలను భారత్‌లోని వాళ్ల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసే యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని మోదీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement