భారత జట్లకే రెండు టైటిల్స్‌ | Two titles for Indian teams | Sakshi
Sakshi News home page

భారత జట్లకే రెండు టైటిల్స్‌

Jul 31 2026 4:18 AM | Updated on Jul 31 2026 4:18 AM

Two titles for Indian teams

కామన్వెల్త్‌ టీటీ చాంపియన్‌షిప్‌   

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. హోరాహోరీగా సాగిన పురుషుల విభాగం ఫైనల్లో భారత్‌ 3–2 తేడాతో మలేసియాపై విజయం సాధించగా... మహిళల జట్టు కూడా 3–0తో మలేసియానే చిత్తు చేసింది.  విజేతగా నిలిచిన మహిళల జట్టులో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉంది. విజేతగా నిలిచిన జట్లకు 10 వేల డాలర్ల (రూ. 9 లక్షల 55 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. 

పురుషుల ఫైనల్లో ముందుగా మానవ్‌ ఠక్కర్‌ 12–10, 11–7, 5–11, 11–5తో జావెన్‌ చూంగ్‌పై, మనుశ్‌ షా 11–13, 11–9, 11–7, 2–11, 11–7తో షెన్‌ వాంగ్‌పై గెలుపొందడంతో భారత్‌ 2–0తో ముందంజలో నిలిచింది. అయితే భారత సీనియర్‌ స్టార్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ 7–11, 8–11, 10–12తో హాంగ్‌ యూ టే చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. హర్మీత్‌ దేశాయ్‌ను భారత్‌ పక్కన పెట్టడంతో మళ్లీ బరిలోకి దిగిన మానవ్‌ 11–4, 8–11, 11–8, 7–11, 1–11తో వాంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. 

చివరి మ్యాచ్‌లో చెలరేగిన మనుశ్‌ 11–7, 11–4, 11–4తో చూంగ్‌పై గెలుపొంది జట్టుకు టైటిల్‌ ఖాయం చేశాడు. మహిళల ఫైనల్లో భారత్‌ ఏకపక్ష విజయం సాధించింది. వరుస మ్యాచ్‌లలో స్వస్తిక ఘోష్‌ 11–7, 11–2, 9–11, 11–9తో జిన్‌ టీపై, ఆకుల శ్రీజ 9–11, 11–6, 11–4, 5–11, 11–3తో లైన్‌ అనాక్‌పై, యశస్విని 7–11, 11–3, 17–15, 11–5తో అలైస్‌ లీ సియాన్‌పై గెలుపొందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement