తైపీ సిటీ: తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 15–21, 16–21తో భారత్‌కే చెందిన కిరణ్ జార్జి చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 9–21, 19–21తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు.
మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అన్‌మోల్ ఖరబ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో తన్వీ 21–17, 22–20తో థలిత రమధాని వీర్యవాన్ (ఇండోనేసియా)పై, ఉన్నతి 21–19, 21–12తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌పై గెలిచారు. దేవిక 21–16, 21–15తో ని కడెక్ ధిండా అమర్త్య ప్రతివి (ఇండోనేసియా)ను ఓడించింది. అన్‌మోల్ 10–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.


