ఆసియా మహిళల చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అదరగొట్టింది. హాంకాంగ్‌లో గురువారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో హారిక ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలో విజేతగా నిలిచింది. 50 మంది ప్లేయర్లు పోటీపడ్డ ర్యాపిడ్ ఫార్మాట్‌లో హారిక, అనా షుఖ్‌మన్ (రష్యా) నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరుతో హారికకు టైటిల్ ఖరారైంది. అనా షుఖ్‌మన్ రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది.
హారిక ఆరు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మరోవైపు బ్లిట్జ్ ఫార్మాట్‌లో 46 మంది క్రీడాకారిణులు పోటీపడ్డారు. నిర్ణీత 13 రౌండ్ల తర్వాత హారిక 10.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. హారిక తొమ్మిది గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓటమి పాలైంది. 10 పాయింట్లతో వాలెంటీనా గునీనా (రష్యా) రెండో స్థానం పొందింది. ఇదే టోర్నీ పురుషుల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలలో భారత గ్రాండ్‌మాస్టర్ గౌతమ్ కృష్ణకు రెండో స్థానం దక్కించి.


