
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ బరిలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక
చెన్నై: కూతురు సమక్షంలో టైటిల్ సాధించడమే తన లక్ష్యమని చెన్నై గ్రాండ్ మాస్టర్స్–2025 టోర్నమెంట్... చాలెంజర్స్ విభాగంలో బరిలోకి దిగుతున్న భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వెల్లడించింది. పాపకు జన్మనిచ్చిన తర్వాత... స్వదేశంలో తొలిసారి ఓ పెద్ద టోర్నీ ఆడుతుండటం ఆనందంగా ఉందని హారిక పేర్కొంది. రెండేళ్ల హన్వికను వదిలి విదేశాల్లో టోర్నీలు ఆడటం కష్టంగా ఉండేదని... ఇప్పుడు చెన్నైలోనే పోటీలు జరుగుతుండటంతో కుటుంబంతో కలిసి పాల్గొంటున్నట్లు వెల్లడించింది.
‘ఇంటికి దగ్గరగా ఆడుతుండటం చాలా ఆనందంగా ఉంది. పాపతో కలిసి ఓ టోర్నీకి రావడం ఇదే తొలిసారి. నా క్రీడా జీవితంలో ఇప్పుడు తను కూడా ఒక భాగం కానుంది. కూతురు సమక్షంలో మ్యాచ్‌లు ఆడనుండటం చాలా ఉద్వేగంగా ఉంది. తల్లి అయిన తర్వాత పాపను వదిలి ఉండటం ఎంత కష్టమో తెలిసొచ్చింది. పాపను ఇంట్లో వదిలి టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిసారీ ఎంతో బాధపడేదాన్ని. వెంట తీసుకెళ్లాలని ఎంతో అనిపించేది. కానీ, అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఆహారం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని వెనకడుగు వేసేదాన్ని’ అని హారిక చెప్పుకొచ్చింది.
ప్రస్తుత భారత చెస్ బృందంలో చిన్నపిల్లలతో గడపడంలో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అత్యుత్తమమని హారిక కితాబిచ్చింది. ‘గుకేశ్ పిల్లలను బాగా హ్యాండిల్ చేస్తాడు. అతడు మంచి ‘బేబీ సిట్టర్’. ఢిల్లీలో ఒకసారి అతడు చిన్న పిల్లలతో మమేకమైన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా వల్ల కూడా అలా సాధ్యం కాదేమో’ అని హారిక చెప్పింది. జార్జియాలో ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ ‘టైబ్రేక్’లో దివ్య దేశ్‌ముఖ్ చేతిలో పరాజయం పాలైన హారిక... ఆ పరాజయాన్ని పక్కన పెట్టి చెన్నైలో తిరిగి సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.