విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శుక్రవారం ఆరో రౌండ్‌లో నొదిర్బాక్ అబ్దుస్సత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిన గుకేశ్... శనివారం ఏడో రౌండ్‌లో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో కూడా పరాజయం పాలయ్యాడు. ఏడు రౌండ్‌ల తర్వాత గుకేశ్ ఒకే ఒక రౌండ్‌లో గెలిచి రెండు పరాజయాలు, నాలుగు డ్రాలు నమోదు చేశాడు.
మరో భారత ఆటగాడు ప్రజ్ఞానంద, బ్లూబమ్ మథియాస్ (జర్మనీ) మధ్య జరిగిన ఏడో రౌండ్ గేమ్ డ్రాగా ముగియగా, వాన్ ఫారెస్ట్ జోర్డాన్ (నెదర్లాండ్స్) చేతిలో అరవింద్ చిదంబరం ఓడిపోయాడు. ఆరో రౌండ్‌లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి... బ్లూబమ్ మథియాస్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించాడు.
ఏడు రౌండ్‌లు ముగిసే సరికి నాలుగు విజయాలు సాధించిన అబ్దుస్సత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టోర్నమెంట్‌లో 14 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటుండగా... ప్రతీ ప్రత్యరి్థతో ఒక్కో సారి ఆడుతూ ఆటగాళ్లు 13 రౌండ్లలో తలపడాల్సి ఉంటుంది.


