స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ నార్వే చెస్ టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మహిళల ఈవెంట్‌లో 19 ఏళ్ల భారత ప్లేయర్ తలపడనుంది. రెండేళ్ల క్రితం 2024లో మొదలైన ఈ టోర్నీలో పోటీపడనున్న యువ క్రీడాకారిణిగా ఆమె నిలువనుంది. మే 25 నుంచి జూన్ 5 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
ప్రపంచకప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ టైటిల్, మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హతతో గతేడాదిని చిరస్మరణీయం చేసుకున్న ఆమె అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ఆశిస్తోంది. దివ్యతో పాటు ప్రపంచ మేటి చెస్ ప్లేయర్లంతా నార్వే చెస్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ బిబిసారా అసబయేవా (కజకిస్తాన్), డిఫెండింగ్ నార్వే చెస్ మహిళల చాంపియన్ అన ముజిచుక్ (ఉక్రెయిన్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
‘నార్వే ఈవెంట్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అక్కడికి వెళ్లనుండటం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని దివ్య పేర్కొంది. గతేడాది జరిగిన ఈవెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి పాల్గొన్నారు. ఈ ఏడాది ఓపెన్ కేటగిరీలో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు.


