అద్దాల ట్రైన్‌లో అరోరా మ్యూజిక్.. చూస్తే మైమరచిపోవాల్సిందే | Norway Midnight Aurora Train Full Details Telugu | Sakshi
Sakshi News home page

అద్దాల ట్రైన్‌లో అరోరా మ్యూజిక్.. చూస్తే మైమరచిపోవాల్సిందే

Feb 10 2026 11:25 PM | Updated on Feb 11 2026 12:09 AM

Norway Midnight Aurora Train Full Details Telugu

బస్సులోనో, ట్రైన్‌లోనో వెళ్తున్నప్పుడు.. 'నాకు విండో సీటే కావాలి' అని పిల్లలు మారాం చేయడం చూస్తుంటాం. బయట కనిపించే ప్రకృతి అందాల కోసం ఆ ఆత్రుత. అయితే ట్రైన్‌లో కూర్చున్న వారందరికీ విండో సీటే అయితే? బయటి ప్రపంచం మొత్తం అద్దాల్లా మన ముందుంటే? ఎలా ఉంటుంది. ఈ కలను నిజం చేసింది నార్వే.

నార్వే ప్రభుత్వం ప్రపంచంలోనే ప్రత్యేకమైన పానొరమిక్ నైట్ ట్రైన్‌ని ప్రారంభించింది. ఈ ట్రైన్ పేరు 'మిడ్‌నైట్ అరోరా రూట్'. ప్రత్యేకంగా నార్తర్న్ లైట్స్‌ని చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం దీన్ని రూపొందించారు. సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు నార్వే ఆర్కిటిక్ ప్రాంతంలో ఆకాశమంతా రంగుల కాంతులు మెరుస్తుంటాయి. వాటినే నార్తర్న్ లైట్స్ అంటారు. ప్రత్యేకంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ఇవి చూడటానికి మంచి టైమ్. ఈ సమయంలో రాత్రులు ఎక్కువగా ఉంటాయి. ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ట్రోమ్సో నగరానికి వేలాది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసేందుకే వస్తుంటారు.

ఈ ట్రైన్ భోగీలు పూర్తిగా గాజుతో తయారు చేశారు. గాజు గోడలు, గాజు పైకప్పు అంటే ట్రైన్ లోపల కూర్చున్నా 360 డిగ్రీల కోణంలో బయట ప్రకృతి అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకాశం అంతా విరిసే అరోరా రంగులు, మెరిసే నక్షత్రాలు, మంచుతో కప్పుకున్న పర్వతాలు, జలపాతాలు అన్నీ ఒకే ఫ్రేమ్‌లో!

ఆర్కిటిక్ ప్రాంతం అంటే గడ్డ కట్టే చలి. కానీ ట్రైన్‌లో ప్రయాణికుల కోసం హీటెడ్ సీట్లు, వెచ్చని బ్లాంకెట్లు ఏర్పాటు చేశారు. బయట మంచు లోపల వెచ్చదనం.. అదే ఈ ప్రయాణం ప్రత్యేకత. ఇంకో ఆసక్తికర విషయం ఏవటంటే ఈ ట్రైన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. అంటే ప్రకృతి మధ్య ప్రయాణం. ప్రకృతిని కాపాడే శక్తితో! నార్వే మాత్రమే కాదు స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్‌లాండ్, కెనడా, అలాస్కా ప్రాంతాల్లో కూడా అరోరా కనిపిస్తుంది. కానీ ఇలా అద్దాల ట్రైన్‌లో ప్రయాణిస్తూ చూడటం మాత్రం అరుదైన అనుభూతి.

Advertisement
 
Advertisement
Advertisement