బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో రాబోయే మే నెలలో నగర కౌన్సిలర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఓ ఉగ్రవాది పోటీ చేస్తుండటం షాకింగ్‌గా అనిపిస్తోంది. 1999లో యెమెన్‌లోని బ్రిటీష్ కాన్సులేట్, ఓ మసీదు, స్విస్ హోటల్‌పై బాంబు దాడులు జరగ్గా.. వీటిలో భాగమైన షాహిద్ భట్ దోషిగా తేలాడు. ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు కారణంగా జైలుశిక్ష అనుభవించాడు.
ఉగ్రవాది అబూ హమ్జాకు గతంలో అనుచరుడిగా ఉన్న భట్.. అప్పట్లోనే అఫ్ధానిస్తాన్, బోస్నియా, తర్వాత యెమెన్‌కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను షాహిద్ ఖండించాడు. బర్మింగ్‌హామ్ కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనని తాను సమర్థించుకున్నాడు.
యెమెన్ కోర్టులో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా నాకు శిక్ష విధించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో నాకే ఓటేయాలని ఎవరినీ బలవంతం చేయను. నచ్చకపోతే నాకు ఓటు వేయొద్దు అని షాహిద్ భట్ క్లారిటీ ఇచ్చాడు.
షాహిద్ భట్.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. దీనికి అఖ్మద్ యాకుబ్, షకీల్ అఫ్జర్ నాయకత్వం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజా, పాలస్తీనా అంశాలపై లేబర్ పార్టీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఓటర్లపై ఈ కూటమి ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుని ఈ స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీయగలదని అంచనా వేస్తున్నారు.
బ్రిటన్ చట్టాల ప్రకారం, విదేశాల్లో లేదా దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో శిక్ష అనుభవించినవారికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఈ నిబంధనలు భట్‌కు అనుకూలంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లేబర్ ఎంపీ జెస్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. ఉగ్రవాద దోషిగా తేలిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా పోటీపడటం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.


